ఒంగోలు, అక్టోబరు 4,
భర్తను బట్టి భార్యలు రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితులు మనం చూశాం. కానీ, మారుతున్న ట్రెండులో రాజ కీయాలను కూడా భార్యలే మేనేజ్ చేస్తున్నారు. వారి కనుసన్నల్లోనే భర్త లు నడవాల్సిన పరిస్థితి కనిపిస్తోం ది. ఈతరహా రాజకీయాలు ఇటీవల కాలంలో మనకు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా.. ప్రకాశం జిల్లా పరుచూరు రాజకీయాల్లో కూడా భార్య హవా పెరిగిపోవడంతో భర్తకు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. ఇక్కడ నుంచి వరుస విజయాలు సాధించిన ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. టీడీపీ నుంచి బయటకు వచ్చారు.ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2004, 09 ఎన్నికల్లో పర్చూరు నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో ఆయన సతీమణి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి రంగంలోకి దిగారు 2004లో బాపట్ల ఎంపీగా… 2009లో విశాఖ నుంచి గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్‌ను తృణ ప్రాయంగా విడిచి పెట్టి బీజేపీలోకి చేరిపోయారు.ఈ క్రమంలోనే రాజంపేట నియోజకవర్గంనుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే, ఆ ప్రయత్నం ఫలించలేదు. అయినప్పటికీ.. ఆమె బీజేపీని విడిచి పెట్టలేదు. ఇదిలావుంటే, తాజా ఎన్నికల సమయానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడు చెంచురామ్‌ను రాజకీయంగా వారసుడిగా ప్రకటించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుని పరుచూరు నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే, అప్పటికే అమెరికా పౌరసత్వం ఉండడంతో అది కేన్సిల్ కాకపోవడం చెంచురామ్ బదులుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేయడం ఓడిపోవడం తెలిసిన విషయాలే.ఇక, ఆ తర్వాత జగన్ ఈ మొత్తం ఫ్యామిలీ పార్టీకి అండగా ఉంటుందని భావించారు. కానీ, దీనికి రివర్స్‌లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన భార్య కొంగు పట్టుకుని తిరగడం ప్రారంభించారు. బీజేపీ నుంచి వచ్చేది లేదని పురందేశ్వరి తెగేసి చెప్పడంతోపాటు.. జగన్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఆడించినట్టు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇక, నిన్న మొన్నటి వరకు తిట్టిపోసిన తన మరిది, టీడీపీ అధినేత చంద్రబాబును పరోక్షంగా వెనుకేసుకు రావడం కూడా ప్రారంభించారు. ఈ పరిణామాలను గమనించి కూడా తన సొంత పార్టీ, తనకు టికెట్ ఇచ్చిన పార్టీ అధినేతపై భార్య చేస్తున్న విమర్శలను ఖండించలేక పోయారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దీనిని నిశితంగా గమనించిన జగన్ తాజాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి చెక్ పెట్టారు.ఎన్నికలకు ముందు పార్టీ మారిన పురుచూరు వైసీపీ ఇంచార్జ్ రావి రామనాథం బాబును సైలెంట్‌గా పార్టీలోకి తీసుకున్నారు. ఈయనతో స్వయంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి వంటివారు మాట్లాడి లైన్ క్లియర్ చేశారు. అంతేకాదు, త్వరలోనే ఈయనకు మళ్లీ నియోజకవర్గం పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి పరుచూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పగ్గాల నుంచి తప్పించేందుకు కూడా వైసీపీ సాకులు రెడీ చేసుకుంది. పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉండడం లేదని… కార్యకర్తలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు విషయంలో అసంతృప్తితో ఉంటున్నారన్న ఆరోపణలు వైసీపీ నుంచి రెడీగా ఉన్నాయట. ఇలా మొత్తంగా సతీమణి రాజకీయాలతో పతి తన రాజకీయ ప్రస్థానాన్ని తానే ప్రమాదంలోకి నెట్టుకున్నారని అంటున్నారు పరిశీలకులు.