YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చేనేత కార్మికులంటే మగ్గాలకే పరిమితమా

చేనేత కార్మికులంటే మగ్గాలకే పరిమితమా

గుంటూరు, అక్టోబరు 4,
ప్రభుత్వం చేనేత కార్మికులకు 'వైఎస్‌ఆర్‌ చేనేత భరోసా' కింద నెలకు రూ.2 వేల చొప్పున అందిస్తామనే పథకం మగ్గాలకే పరిమితమా? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగంగా ఉన్న చేనేత నేడు సంక్షోభంలో కూరుకుపోయి కార్మికులు జీవనోపాధి కరువైంది. చేనేత రంగంలో పనిచేసే కార్మికులకు ఏడాది పొడవునా పని ఉండదు. వర్షాకాలంలో అధిక వర్షాలు కురిస్తే నెలల తరబడి పనుల్లేక పస్తులుండాలి. భారీవర్షాలకు మగ్గం గుంటలోకి నీరు చేరి నూలు తడిసి పాడయ్యే ప్రమాదమూ ఉంటుంది. నేచిన వస్త్రానికి సరైన ధర లేక పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకోవడంతో కార్మికులు ఇతర రంగాల్లో పనిచేయాల్సిన దుస్థితి వచ్చింది. ఒకప్పుడు వేల సంఖ్యలో ఉన్న మగ్గాలు నేడు వందల సంఖ్యకు దిగజారాయి. ఐలవరం, అద్దేపల్లి, భట్టిప్రోలులో 3 వేల మగ్గాలకుపైగా పనిచేసేవి. కానీ నేడు పరిశ్రమ సంక్షోభం కారణంగా మొత్తం 500 మగ్గాలకు మించి పనిచేయడం లేదు.చేనేత కార్మికులు అధిక శాతం అనారోగ్యానికి గురవుతుంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం 50 ఏళ్లకే చేనేత పెన్షన్‌ పొందే వెసులుబాటు కల్పించింది. దీంతో కార్మికులు 50 ఏళ్లు నిండిన వారు పెన్షన్లు పొందుతున్నారు. అయితే ప్రస్తుతం పెన్షన్‌ పొందే వారికి చేనేత భరోసా వర్తించదని, సంబంధిత శాఖాధికారుల ద్వారా తెలుస్తోంది. ఇదే జరిగితే 50 ఏళ్లలోపు వారు మగ్గంపై నేత నేసే కార్మికులు అతితక్కువ మంది ఉంటారు. గిట్టుబాటవ్వని చేనేత పరిశ్రమను విడనాడి అనేక మంది ఇతర రంగాల్లో పనిచేస్తుండగా ఏ పనీ చేయలేని ఆదినుండి నేత పనిపైనే ఆధారపడి జీవించే వారు మాత్రమే ఈ రంగంలో ఉన్నారు. అలాంటి తరుణంలో జగన్‌ సైతం తన పాదయాత్ర సందర్భంలో చేనేత కార్మికులకు నెలకు రూ.2 వేలు భృతిగా అందజేస్తానని ప్రకటించారు. అధికారం చేపట్టాక మగ్గంపై నేతనేసే కార్మికులకే చేనేత భరోసా అందజేయబడుతుందని ఆ మేరకు సంబంధిత అధికారులతో సర్వే చేయిస్తున్నారు. అయితే మగ్గంపై బట్టనేయడానికి ముందుగా నూలు అనేక దశలలో రూపుదిద్దుకుని మగ్గంపైకి వస్తేనే కార్మికుడు బట్టను నేయగలడు. దీనికిగాను ముందుగా ముడి నూలును డయింగ్‌ ద్వారా రంగులు అద్దబడి దానిని పడుగులు చేసి చిలపలుగా చుట్టి చిలపల నూలుపై రాట్నంపై వడికి కండెలుగా చుట్టి ఆ కండెలను మలతో సిద్ధం చేసి మగ్గంపైకి ఎక్కించబడిన దానితో కండెల ద్వారా వచ్చే దారాలతో కార్మికుడు బట్టలు తయారు చేస్తాడు. ఈ విధానంలో బట్ట మగ్గంపై రావడానికి 4-5 దశలలో కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. వీరందరినీ చేనేత కార్మికులుగానే పిలవబడతారు. వీరందరు చేసిన పనితోనే బట్ట తయారవుతుంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మగ్గం నేసే వ్యక్తికే ఈ పథకం వర్తిస్తుందని ప్రకటిస్తే ఈ రంగంలో పనిచేసే మిగితా విడి భాగాల కార్మికుల పరిస్ధితి ఏంటని వాపోతున్నారు. ముడి నూలు నుండి మగ్గంపై ఎక్కేసరికి ఉన్న పని విధానంలో అధిక శాతం మహిళా కార్మికులే పనిచేస్తుంటారు. చిలపల నూలు వలిచి, కండెలు చుట్టే వారికి రోజుకు రూ.40 నుంచి రూ.70 మించి ఆదాయం రాదు. అదే పడుగులు చేసే వారికి భార్యభర్తలిద్దరూ కలిసి పనిచేస్తే రోజుకు రూ.200 కూడా ఆదాయం లభించదు. అయినా ఈ రంగంలో పనిచేస్తూ మరోపని చేయడానికి చేతకాక దీనిపైనే ఆధారపడి అరకొర వేతనంతో జీవిస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం చేనేత భరోసా పథకాన్ని మగ్గానికే కేటాయిస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం మగ్గంతో పనిలేకుండా ప్రతి చేనేత కార్మికునికి వర్తించేలా ప్రవేశపెడితే చేనేత కార్మికులకు పథకం ప్రయోజనం కల్గిస్తుందని డిమాండ్‌ చేస్తున్నారు.ప్రభుత్వం పెన్షన్‌తో లింకు కలిపితే భట్టిప్రోలు, ఐలవరం, అద్దేపల్లి గ్రామాల్లో 100 మంది కూడా అర్హత కల్గిన వారు ఉండరని కార్మికులు ఆందోళన వెలిబుచ్చు తున్నారు. గత ప్రభుత్వం వర్షాకాలంలో రెండు నెలల పాటు నెలకు రూ.2 వేలు చొప్పున భృతిని అందిస్తామని ప్రకటించగా ప్రస్తుత ముఖ్యమంత్రి రెండు నెలలు కాదు సంవత్సరం పాటు ప్రతి నెలా రూ.2 వేలు అందజేస్తానని చెప్పడంతో ఎంతో ఆశపడ్డామని, దానిని పెన్షన్‌ పొందే వారికి వర్తించదని ప్రకటిస్తే ఈ పథకం నిజమైన చేనేత కార్మికులకు ఏమాత్రం ఉపయోగపడదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఈ విషయం వెల్లడించకపోయినా అధికారుల ద్వారా వింటున్నామని అదే జరిగితే జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీ నెరవేరినట్లు కాదని అంటున్నారు.

Related Posts