హైదరాబాద్ అక్టోబర్ 4
నగరంలోని చెరువులను పర్యవేక్షిస్తూ అభివృద్ధి చేస్తున్నామని, చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు చేపట్టామన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులలో 127 చెరువులను అభివృద్ధి పరిచేందుకు గుర్తించి, అందులో 48 చెరువులను అభివృద్ధి చేశామన్నారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ. 407 కోట్ల 30 లక్షలను మంజూరు చేశాం. ఇప్పటికే రూ. 218 కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. రూ. 94 కోట్ల 17 లక్షల అంచనా వ్యయంతో 63 చెరువుల సుందరీకరణను జీహెచ్ఎంసీ చేపట్టి 48 చెరువుల పనులను పూర్తి చేసింది. మిగతా 15 చెరువుల పనులు పురోగతిలో ఉన్నాయి. రూ. 282 కోట్ల 63 లక్షల అంచనా వ్యయంతో మిషన్ కాకతీయ అర్బన్ కింద 19 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టామన్నారు. రూ. 30 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో 45 చెరువుల అభివృద్ధి, వరద వల్ల దెబ్బతిన్న మరమ్మతులను జీహెచ్ఎంసీ చేపట్టింది అని కేటీఆర్ తెలిపారు.దశాబ్దాలుగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల అభివృద్ధికి ఒక డివిజన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఒక స్పెషల్ కమిషనర్‌ను నియమిస్తాం. చెరువుల అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. హైదరాబాద్‌లో వచ్చే రెండేళ్లలో 31 సీవరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. నాలాలపై ప్రత్యేక దృష్టి సారించాం. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించి, వారికి వెంటనే పునరావాసం కల్పించాలని ఆలోచిస్తున్నాం. నాలాల విస్తరణకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని కేటీఆర్ చెప్పారు.