సకల మృత్యుభయ దోష నివారణకు ఓం నమో భగవతే మహా మృత్యుం జయాయ
‘రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్
నమామి శిరసా దేవం కింనో మృత్యుః కరిష్యతి.’
‘మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్
జన్మ మృత్యు జరారోగైః పీడితం కర్మ బంధనైః.’
‘ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః’ అంటూ శివపూజ చేసే సందర్భంలో ఈ మహారుద్రుని వేర్వేరు నామాలతో సంబోధించడం సంప్రదాయం. శివుడు కాలస్వరూపుడు. కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్నవాడు. వ్యక్తి కాలానికి అధీనుడు. ఒక ప్రత్యేక కాలంలో పుట్టుక, మరో కాలంలో మరణం మనిషికి సాధారణం. జననం, పెరుగుదల, మరణాలన్నీ ఈ కాలానికే అధీనమై ఉంటాయి.
మృత్యువు అంటే కాలం తీరడమే. అందుకే, శరీరం పోయినా ‘కీర్తి శరీరం’ మిగిలి ఉండేటట్లు నూతన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఉన్న కొంత సమయాన్ని సద్వినియోగమయ్యేటట్లు చేసుకొని శరీరం అకాలంలో పోకుండా, మరణించినా మిగిలి ఉండేటట్లు జీవించడానికి ప్రయత్నించాలి. అందుకే, ‘మృత్యుంజయుని ఆరాధన.’
మృత్యువంటే కేవలం మరణమే కాదు. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక నష్టాలు, అవమానాలు కూడా. ఇలాంటివి జరుగుతుంటే ‘ఇంతకన్నా చావే నయం’ అనుకొంటారెందరో. ఇటువంటివి మన గృహాల్లో జరుగకూడదనే భావనతో శివుని ఆరాధించే సంప్రదాయం ఉంది. మృత్యువును జయించిన శివుని, తనను ప్రార్థన చేస్తే ఎటువంటి మృత్యువునైనా మన వద్దకు రాకుండా చేసేవాడైన శంకరున్ని మృత్యుంజయ భావనతో జపిస్తే ఇంట్లో అకాల అనర్థాలనుండి బయటపడవచ్చు. ఈ దోషాల నివారణకు ‘ఓం నమో భగవతే మహా మృత్యుంజయాయ’ జపాన్ని తీవ్రస్థాయిలో జపిస్తే సరి. అకాల మృత్యువులు దరి చేరవు. అనారోగ్యాలు, అవమానాలు, ఆర్థిక నష్టాలూ ఉండవు.