తిరుపతి, అక్టోబరు 5,
టెర్రకోట కుండలు, బొమ్మలు అంటేనే తొలుత గుర్తుకు వచ్చేది కురబలకోట మండలంలోని కంటేవారిపల్లె. బొమ్మల ఊరుగా పేరు గాంచింది. ఏ ఇంటి ముందు చూసినా రకరకాల బొమ్మలు కళకళలాడుతూ కన్పిస్తాయి. హైవేపై రాకపోకలు సాగించే వివిధ ప్రాంతాల వారు వీటి కోసం ఆగుతారు. ప్రాణం లేని బొమ్మలు మనుషులతో భావాలను పంచుకుంటున్నట్లుగా కనిపిస్తాయి. 1983లో రిషివ్యాలీ స్కూల్ టీచర్ విక్రమ్ పర్చూరే చొరవతో ప్రారంభమైన ఈ కళ నేడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. 36 ఏళ్లుగా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ జనాదరణ పొందుతోంది. ఈ ఊరు మొత్తం టెర్రకోట బొమ్మలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. టెర్రకోట బొమ్మలు తొలుత ఊపిరి పోసుకుంది కంటేవారిపల్లెలోనే. ఇక్కడ 32 కుటుంబాలు ఉన్నాయి. 155 మంది హస్త కళాకారులున్నారు. డీఆర్‌డీఏ శిక్షణ కేంద్రం ఉంది. హైవే రోడ్డుపక్కనే ఈ ఊరు ఉండడంతో బొమ్మల విక్రయానికి కూడా ఈ కళకు కలిసొచ్చింది. టెర్రకోట సౌందర్యం ఇక్కడి కళాకారుల ఖ్యాతిని నలుదిశలా చాటిచెబుతోంది. వీరు తయారు చేయడమే కాకుండా కలకత్తా, గోరఖ్‌పూర్, ఢిల్లీ, అహమ్మదాబాద్, లక్నో, చెల్లి గూడ తదితర ప్రాంతాల నుంచి కూడా నాణ్యమైన బొమ్మలను తెప్పించి, వాటికి అదనపు అలంకరణలు జోడించి, తుది మెరుగులు దిద్ది, వ్రికయిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర గవర్నర్లుగా పనిచేసిన కుముద్‌బెన్ జోషి, కృష్ణకాంత్, రంగరాజన్ లాంటి వారు ఈ ఊరిని సందర్శించారు. కళాకారులను మెచ్చుకున్నారు. కళాకారుల చేతులే మంత్ర దండాలుగా పనిచేస్తాయి. రకరకాల బొమ్మలను ఇట్టే చేస్తారు. ఇక్కడి టెర్రకోట కళ జిల్లాలోని అంగళ్లు, పలమనేరు, సదుం, కాండ్లమడుగు, కణికలతోపు, బి.కొత్తకోట, తెట్టు, చెన్నామర్రి, సీటీఎం, ఈడిగపల్లె తదితర గ్రామాలకు విస్తరించింది. వీళ్లంతా కంటేవారిపల్లెలో నేర్చుకున్నవారే. ఇక్కడి వారు తరచూ శిక్షణ పొందుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ట్రెండ్‌ను పసిగట్టి వ్యాపారం చేస్తున్నారు. దేశంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోని ఎగ్జిబిషన్లకు వెళుతున్నారు. మరో వైపు సంస్కృతి, పల్లె కళ, సంప్రదాయాలకు ప్రతి రూపంగా ఈ మట్టిబొమ్మలు నిలుస్తున్నాయి.పండగలు, సీజన్ బట్టి వ్యాపారాన్ని చేస్తున్నాం. చవితికి వినాయక బొమ్మలు, దీపావళికి ప్రమిదలు, దసరాకు దుర్గ విగ్రహాలు, అక్కగార్ల ఉత్సవాలకు అక్కదేవతలు ఇలా కాలాన్ని బట్టి అవసరమైన వాటిని తయారు చేస్తున్నాం. వంటపాత్రలు, సాధారణ బొమ్మలు ఎప్పుడూ ఉంటాయి. రూ.20 నుంచి రూ. 2వేలు వరకు వెలగల బొమ్మలు, కుండలు ఉన్నాయి.