జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 15 నుంచి ఏపీలో తన ‘రాజకీయ పర్యటనలు’ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఇఫ్పటికే ప్రకటించారు కూడా. అయితే ఈ పర్యటనల కోసం ఓ ప్రత్యేక బస్సు సిద్ధం అవుతోంది. బస్సు నుంచే నేరుగా ప్రజలనుద్దేశించి ప్రసంగించే ఏర్పాటు చేసుకోవటంతో పాటు…బస్సులో కొంత మంది ముఖ్యులతో సమావేశం అయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. పవన్ పర్యటనకు రెడీ అవుతుండటంతో..ఈ బస్సు పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. తొలి దశలో పవన్ కళ్యాణ్ ఏకబిగిన 40 రోజుల పాటు పర్యటించే అవకాశం ఉందని సమాచారం. అవసరాన్ని బట్టి మధ్యలో ఒకట్రెండు రోజులు గ్యాప్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే తొలి దఫా టూర్ లో రాష్ట్రమంతటా కవర్ చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ అక్రమాలను ఎత్తిచూపటంతోపాటు…తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పే ప్రయత్నం చేస్తారు.కొద్ది రోజుల క్రితం కొన్ని మీడియా సంస్థలపైన పవన్ తీవ్ర స్థాయిలో విమర్శలు..ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ పొలిటికల్ టూర్…మీడియా పాత్ర ఎలా ఉండబోతున్నది అనే అంశం కూడా అటు రాజకీయ వర్గాలతోపాటు..సినీ పరిశ్రమ వర్గాల్లోనూ ఆసక్తికర అంశంగా మారింది. చాలా కాలం టీడీపీకి స్నేహహస్తం అందించిన వవన్ ఒక్కసారిగా తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో అధికార పార్టీ షాక్ కు గురైంది. వెంటనే పవన్ బిజెపి ఆడించినట్లు ఆడుతున్నారంటూ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. పవన్ బస్సు యాత్ర ప్రారంభం అయితే ఇప్పటికే హాట్ హాట్ గా ఉన్న ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కటం ఖాయంగా కన్పిస్తోంది.