విజయవాడ, అక్టోబరు 5,
వంగవీటి రాధా వచ్చే ఎన్నికలలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఆయనను తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉపయోగించుకుంటుంది? పార్లమెంటు సభ్యుడిగా పంపుతారా? లేక శాసనసభ స్థానాన్ని కేటాయిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో వంగవీటి రాధా కొంత యాక్టివ్ అయ్యారు. మరో రెండున్నరేళ్లు ఎన్నికలు ఉండటంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించి తన రాజకీయ భవిష్యత్ ను మెరుగుపర్చుకోవాలని వంగవీటి రాధా భావిస్తున్నారు. టీడీపీ అధినాయకత్వం కూడా రాధా ప్లేస్ కోసం వెతుకుతోంది.ఇప్పటికే అనేక పార్టీలు మారిన వంగవీటి రాధా మరోసారి ఆ తప్పు చేయరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజధాని తరలింపు వ్యవహారంతో టీడీపీ ఇక్కడ బలంగా ఉందని, ఇప్పుడు మరో పార్టీలోకి మారి సాహసం చేసే అవసరం లేదని వంగవీటి రాధా భావిస్తున్నారు. అయితే వంగవీటి రాధా కు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆసక్తి మెండుగా ఉంది. అయితే అక్కడ ఆయనకు అవకాశాలు కష్టమేసెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు బలంగా ఉన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన బొండా ఉమ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కూడా. గత ఎన్నికల్లోనూ ఆయన స్వల్ప ఓట్ల మెజారిటీతోనే ఓటమి పాలయ్యారు. అందుకే ఉమను కాదని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ దక్కే అవకాశం వంగవీటి రాధా కు ఎంతమాత్రం లేదు. దీంతో ఆయన ఇతర నియోజకవర్గాలకు వెళ్లాల్సి ఉంటుంది.వంగవీటి రాధా కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయనను ఆ సామాజికవర్గం బలంగా ఉన్న చోట పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎటూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరు. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి వంగవీటి రాధాను పోటీ చేయిస్తే బాగుటుందని కూడా భావిస్తున్నారు. తొలుత గుడివాడ నుంచి బరిలోకి దింపాలనుకున్నా వంగవీటి రాధా కు సేఫ్ ప్లేస్ రాజమండ్రి రూరల్ అని అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది.