న్యూఢిల్లీ, అక్టోబరు 5,
కాంగ్రెస్ కు ఇప్పుడు మిత్రపక్షాలు అతి కొద్ది సంఖ్యలో ఉన్నాయి. ఒకప్పుడు యూపీఏలో ఉన్న పార్టీల్లో ఇప్పుడు ఎవరికి వారే తమ రాష్ట్రాల్లో స్వయంగా ఎదిగేందుకు శ్రమిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికలు వచ్చినప్పడు కాంగ్రెస్ ను దూరంపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే, బీహార్ లో ఆర్జేడీ మాత్రమే కాంగ్రెస్ తో కలసి పోటీ చేసేందుకు ఇష్టపడ్డాయి. మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ ను వేరు చేసి చూస్తున్నాయి.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడటంతో గత ఏడేళ్ల నుంచి ఒక్కొక్కటి మెల్లగా హస్తం పార్టీని దూరం పెడుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉండి అధికారంలో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసంతృప్తులు మిత్ర పక్షాలను ఆలోచనలో పడేశాయింటున్నారు. మహారాష్ట్రలో మిత్రపక్షంగా ఉన్న శివసేన కూడా కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం కావాలని కోరుకుంటుంది.కాంగ్రెస్ ను బలోపేతం చేసే నేత ఇప్పుడు కావాలి. బీజేపీ లో ప్రధాని మోదీకి ధీటుగా సరైన నేత కన్పించడం లేదు. సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధీకి మోదీని ఎదుర్కొనే స్థాయిలేదన్న విశ్లేషణలున్నాయి. వరసగా జరుగుతున్న ఎన్నికలు, దాని ఫలితాలే దీనికి నిదర్శనం. మరి కాంగ్రెస్ కు ఎవరు నాయకత్వం వహిస్తారన్న సందేహం మిత్రపక్షాల్లోనూ బయలుదేరింది.కాంగ్రెస్ కు కొన్ని దశాబ్దాలుగా గాంధీ కుటుంబమే నాయకత్వం వహిస్తుంది. గాంధీ కుటుంబేతర నేతల లీడర్ షిప్ ను అంగీకరించే పరిస్థిితి కనిపించడం లేదు. ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ కే పరిమితమయ్యారు. ఎవరినైనా ఇతర నేతలను నియమించినా ముఖ్యమైన నిర్ణయాలను గాంధీ కుటుంబమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రాహుల్ తప్ప ఆ పార్టీకి దిక్కులేదు. కాంగ్రెస్ పార్టీని నీట ముంచినా…తేల్చినా రాహుల్ తప్ప వేరే శరణ‌్యం లేదు. త్వరగా పార్టీ బాధ్యతలను తీసుకుని పార్టీని నడిపించాలన్న మిత్రపక్షాల కోరికను రాహుల్ గాంధీ మన్నిస్తారో? లేదో? చూడాలి.