YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

పాపం.. పామాయిల్ రైతు!

 పాపం.. పామాయిల్ రైతు!

పశ్చిమగోదావరి జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా ఆయిల్‌పామ్‌ పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఈ పంట సాగవుతున్న జిల్లా ఇదే. ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలమైన నేలలు ఇక్కడ ఉండటంతో ప్రభుత్వం కూడా రైతులను ప్రోత్సహించింది. పెదవేగిలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటుచేసింది. దీంతో పామాయిల్ రైతులకు ఆర్ధిక ఆదరువు దక్కినట్లైంది. అయితే ఈ ఆనందం ఎంతోకాలం నిలవలేదని రైతులు అంటున్నారు. ఒకప్పుడు ఆశాజనంగా ఉన్న ఆయిల్‌పామ్‌ సాగు ప్రస్తుతం కష్టాలమయంగా ఉందని వాపోతున్నారు. ఈ పంట సాగు చేయాలంటేనే భయపడే దుస్థితి నెలకొందని చెప్తున్నారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా కొంతకాలంగా నష్టాలు వస్తుండడంతో పలువురు రైతులు తోటలను తొలగించి వేరే పంటలు వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పండించిన పంటకు సరైన మద్దతు ధర లేకపోవడమే. తెలంగాణలో టన్ను ఆయిల్‌పామ్‌కు 18.48 శాతం దిగుబడిగా నిర్ణయించి రూ.10,048 ధర చెల్లిస్తోంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టన్ను ఆయిల్‌పామ్‌కు 16.40 శాతం దిగుబడిగా నిర్ణయించి రూ.8,222 మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఆయిల్ పామ్ సాగు తమ వల్ల కాదని, భారీగా పెట్టుబడి పెడుతున్నా ఆదాయం ఆశించినమేర ఉండడంలేదని రైతులు అంటున్నారు.

 

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పెదవేగి ఫ్యాక్టరీలో నిర్ణయించే దిగుబడి శాతంపై రైతులు అనేకసార్లు ఆందోళనలు చేశారు. దీంతో అశ్వారావుపేటలోని ఫ్యాక్టరీలో నిర్ణయించిన దిగుబడి ఆధారంగా చేసుకుని మధ్యస్థంగా ధర నిర్ణయించేవారు. ఇప్పుడు అశ్వారావుపేట తెలంగాణలోకి వెళ్లడంతో పెదవేగి ఫ్యాక్టరీలో నిర్ణయించే దిగుబడి శాతంపైనే ఇక్కడి రైతులకు ధర నిర్ణయిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టన్నుకు రూ.2 వేలు తేడా ఉండటంతో రైతులకు ఏంచేయాలో అర్థం కావడం లేదు. దీంతో ఆయిల్‌పామ్‌ రైతుసంఘం నాయకులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రికవరీ శాతాన్ని ఒక శాతానికి పెంచి న్యాయం చేస్తామని చెప్పారు. అయితే అది నేటికీ అమలు కాలేదని రైతులు అంటున్నారు. మరోవైపు కౌలురైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లీజు, పెట్టుబడులు పోనూ చిల్లిగవ్వ మిగలని దుస్థితి నెలకొందని వారు వాపోతున్నారు.  ఆయిల్‌పామ్‌తోట లీజు ఎకరాకు రూ.40 వేలు వరకూ ఉంది. పెట్టుబడి రూ.30 వేలకుపైగా అవుతోంది. మొత్తం రూ.70 వేలు ఖర్చు తేలుతోంది. ఎకరాకు ఎనిమిది టన్నుల వరకూ దిగుబడి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధర ప్రకారం ఎనిమిది టన్నులకు రూ.64 వేలు వస్తోంది. అంటే ఇంకా రూ.ఆరు వేలు నష్టమే మిగులుతోంది. ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించి పంటకు గిట్టుబాటు ధర చెల్లించి అండగా ఉండాలని ఆయిల్ పామ్ రైతులు విజ్ఞప్తిచేస్తున్నారు.  

Related Posts