హైదరాబాద్, అక్టోబరు 5,
బీజేపీ నేతలపై కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. ఆమె మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికలకు సవాల్ విసరడం బీజేపీ నాయకులకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. మీడియాలో కనిపించ డం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైనా సరే హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత సూచించారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ విజయంపై ఆమె ధీమా వ్యక్తం చేశారు.హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని అన్నారు. ‘సీఎం కేసీఆర్‌కు రాజీనామాపై సవాల్ విసురుతున్న బండి సంజయ్.. పశ్చిమ్ బెంగాల్ ఉప ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ గెలిచారు.. అక్కడి ఎన్నికను బీజేపీ చాలెంజ్‌గా తీసుకుంది కదా.. ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేస్తారా?.. సమాధానం చెప్పాలని’ ఆమె ప్రశ్నించారు. ఇక, మాజీ మంత్రి ఈటల రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప-ఎన్నిక జరుగుతోన్న విషయం తెలిసిందే.మరోవైపు, హుజూరాబాద్‌లో ఒక్కో ఓటును రూ.25 వేలకు కొనుగోలు చేసి గెలవాలని టీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందని, ప్రజలు ఆ డబ్బు తీసుకున్నా.. ఓటు మాత్రం బీజేపీకే వేయడం ఖాయమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఉప-ఎన్నికకు అక్టోబరు 30న పోలింగ్ జరగనుండగా.. తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. ఉప-ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉప-ఎన్నిక ముందే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించడంతో కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ది కోసమే కేసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించారని ఆరోపిస్తున్నాయి.