న్యూఢిల్లీ, అక్టోబరు 5,
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేర్ ఘటనపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైతుల మరణానికి కారుకులైనవారిపై హత్య కేసు పెట్టాలని సూచించారు. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వరుణ్ గాంధీ లేఖ రాశారు. నిరసన తెలుపుతున్న రైతుల పట్ల సంయమనం, సహనంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.ట్విట్టర్‌లో రైతులకు సంఘీభావం తెలిపిన వరుణ్ గాంధీ.. హింసాత్మక ఘటనపై యూపీ సీఎం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇది హృదయ విదారకం సంఘటనని, దేశ ప్రజలలో వేదన, ఆగ్రహాన్ని కలిగించిందని వరుణ్ గాంధీ అన్నారు. ‘మనం వారితో చాలా సంయమనం.. సహనంతో వ్యవహరించాలి. ఏది ఏమైనా మనం మన అన్నదాతల పట్ల సున్నితత్వంతో వ్యవహరించాలి.. ఇవి కేవలం గాంధేయ, ప్రజాస్వామ్య పద్ధతిలో మాత్రమే చట్ట పరిధిలో ఉండాలి’ అని పేర్కొన్నారు.ఆందోళన చేస్తున్న రైతు సోదరులు కొన్ని అంశాలలో ఇబ్బందులు పడుతున్నారని, ప్రజాస్వామ్య హక్కులతో తమ నిరసన తెలుపుతున్నారని వరుణ్ గాంధీ అన్నారు. తక్షణమే ఘటనకు బాధ్యులైన అనుమానితులను గుర్తించి, అరెస్ట్ చేయాలన్నారు. లఖింపూర్ ఖేర్ వద్ద ఆదివారం జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కాన్వాయ్ ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.ఘటనలో ఆగ్రహానికి గురైన అన్నదాతలు కాన్వాయ్‌లోని వాహనాలపై దాడిచేశారు. దీంతో ఓ కారులోని నలుగురు తీవ్ర గాయాలతో చనిపోయారు. రెండు కార్లకు నిప్పంటించారు. ఈ ఘటనపై రైతు సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల దారుణంగా వ్యవహరించారని ధ్వజమెత్తాయి. అటు, పరామర్శకు వెళ్తోన్న ప్రియాంక గాంధీని సీతాపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను లఖింపూర్ ఖేర్ వెళ్లకుండా వెనక్కు పంపే ప్రయత్నం చేశారు.