లక్నో,అక్టోబరు 5,
లఖీంపూర్ ఖేరీలో ఘటన తర్వాత అక్కడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధాజ్ఞలు ఉన్న లఖీంపూర్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన ఆమెపై కేసు నమోదు చేశారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా 28 గంటలుగా నిర్బంధించారని ఆమె ఆరోపించిన కొద్దిసేపటికే ఈ అరెస్ట్ వార్త వచ్చింది. నిజానికి లక్నోలోనే ఆమెను హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే అక్కడి నుంచి ఎలాగోలా బయటపడిన ప్రియాంకా.. తన అనుచరులతో కలిసి లఖీంపూర్ వెళ్లడానికి ప్రయత్నించారు.ఐదు గంటల పాటు ఆమెను వెంబడించిన పోలీసులు సోమవారం ఉదయం 4.30 గంటల ప్రాంతంలో ఆమెను నిర్బంధించి సీతాపూర్‌లోని గెస్ట్‌హౌజ్‌కు తరలించారు. ఇప్పుడా గెస్ట్‌హౌజ్‌నే తాత్కాలిక జైలుగా మార్చారు. ప్రియాంకాపై సెక్షన్లు 151, 107 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌హెచ్‌వో హర్‌గావ్ మెజిస్ట్రేట్‌కు రిపోర్ట్ పంపించారు.