రైతులను అన్ని విధాలా ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డులు ఏర్పాటుచేసింది. వీటిలో రైతులు దిగుబడులు భద్రపరచుకుని లబ్ధి పొందుతారని భావించింది. అయితే చిత్తూరు పీలేరులో ప్రభుత్వ సదుద్దేశం నెరవేరడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుల పనితీరుపై అడిగేవారులేక పోవడంతో నిర్వహణగాడితప్పిందని స్థానికులు అంటున్నారు. అంతేకాక అధికారులు, సిబ్బంది కుమ్మక్కై ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారని విమర్శిస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలో పీలేరు, కలికిరి, వాల్మీకిపురం ప్రాంతాలలో వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. నిబంధనల మేరకు ఈ వ్యవసాయ మార్కెట్‌యార్డులు రైతులకు అందుబాటులో ఉండాలి. రైతులు పండించిన పంటను నిర్ణీత ధర వచ్చేవరకు రైతుల వద్దనుండి యార్డులోని గోదాములలో భద్రపరచి రక్షణకల్పించాలి. అంతేకాకుండా సంబంధిత రైతుకు పంట విలువపై అరవై నుండి డెబ్బైశాతం వరకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం ఇవ్వాలి. పంటలపై రైతులకు పంటమార్పిడి, నిల్వ, రవాణా వంటి పద్దతులపై అవగాహనా సదస్సులు కూడా నిర్వహించాలి. అయితే అధికారులు ఇలాంటివేమీ పట్టించుకోవడంలేదని రైతులు అంటున్నారు. చెక్‌పోస్టులలో కాలక్షేపం చేస్తూ ప్రత్యేకంగా వ్యక్తిగత సిబ్బందిని నియమించుకున్నారని, వారితోనే అక్రమ రవాణా చేస్తున్న వాహనదారుల నుండి అందినకాడికి దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. తమకై మిగిలింది ప్రభుత్వ ఖజానాకు జమచేస్తూ కింది స్థాయి సిబ్బంది సైతం విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారని ఆరోపిస్తున్నారు.
మరోవైపు గోదాములను రైతులకు కేటాయించకుండా తమ ఇష్టారాజ్యంగా వ్యాపారస్థులకు కేటాయిస్తున్నా సరిగా పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితులలో రైతులు ఎవరైనా తమ పంటకు రక్షణకై యార్డు అధికారులను సంప్రదిస్తే ఖాళీ లేదంటున్నారని మండిపడుతున్నారు. అంతేకాదు పశువుల సంతలో కింది స్థాయి సిబ్బంది చేతివాటంతో అక్రమ పశురవాణాను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. వేసవికాలం కావడంతో పశువులకు తాగడాని నిర్మించిన నీటితొట్టెలు చెత్తబుట్టలుగా మారి దుర్గంధం వెదజల్లుతున్నాయని రైతులు అంటున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. ఇదీ పెద్ద సమస్యగా మారింది. ఇదిలావుంటే వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకంపై ఆశావహుల ఆశ కాస్త అడియాసే అవుతోందని, దీంతో వ్యవసాయ మార్కెట్ యార్డు పరిపాలన గాడి తప్పుతోందని రైతులతో పాటూ స్థానికులూ స్పష్టంచేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులూ పెద్దగా పట్టించుకోకపోవడంపై అంతా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్ యార్డుల్లో తిష్ట వేసిన పలు అవకతవకలకు చెక్ పెట్టాలని రైతులు స్పష్టం చేస్తున్నారు. లేదంతో రైతులకు అండగా ఉండాలన్న ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతుందని హెచ్చరిస్తున్నారు.