YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు

గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు

నెల్లూరు, అక్టోబ‌రు 6,
గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు రైతు భరోసా కేంద్రాలను వినియోగించాలని నిర్ణయించింది. ఈ ఏడాది రైతు భరోసా కేంద్రాల ద్వారానే విత్తనాలు, ఎరువులు అందించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, ఇక నుంచి ధాన్యం కొనుగోలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. పంటల గిట్టుబాటు ధర కల్పించడం, వ్యవసాయోత్పత్తుల కొనుగోలు తదితర బాధ్యతలను ప్రభుత్వం జెసిలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే విధి విధానాలు వెలువడనున్నాయి.టిడిపి ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వెలుగు, పౌరసరఫరాలశాఖ, డిసిఎంఎస్‌, డిసిసిబిల ఆధ్వర్యంలో ఏటా కొనుగోలు చేసేవారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ఏకమై ధాన్యం కొనుగోలు చేయకుండానే ఆన్‌లైన్‌లో లెక్కలు చూపించి, అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూశాయి. దీంతో నిజమైన రైతుల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈనేపథ్యంలోనే రైతులు రోడ్డెక్కి ఆందోళనలు సైతం చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. వైసిపి అధికారంలోకొచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిని కొనసాగించారు. గతేడాది కూడా ధాన్యం సేకరణలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈనేపథ్యంలో ఈసారి రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ బాధ్యతలను ప్రభుత్వం జెసిలకు అప్పగించింది. ఇప్పటికే పాలనా సౌలభ్యం కోసం జిల్లాకు ఇద్దరు చొప్పున జెసిలను నియమించిన విషయం తెలిసిందే. స్థానిక పరిస్థితులను బట్టి, అక్కడ పండే వ్వవసాయోత్పత్తులకు గిట్టుబాటు కల్పించే బాధ్యత ఇక నుంచి జెసిలదే కావడంతో కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించనున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామన్న నిర్ణయాన్ని రైతులు, రైతు సంఘాలు స్వాగతిస్తున్నప్పటికీ దీని అమలుపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి.జిల్లాలో 1,105 గ్రామాలకు ఇప్పటికి కేవలం 356 గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంకా 749 గ్రామాల్లో కేంద్రాలు నిర్మాణాల్లోనే ఉన్నాయి. ఖరీఫ్‌ ధాన్యం అందేసరికి, అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు సిద్దం కావాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన మౌలిక వసతులు, సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి ఉంది. మరోవైపు పట్టణాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో పండిన ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారన్నదానిపై స్పష్టతలేదు. అధికారులు మాత్రం త్వరలో వీటిపై విధి విధానాలు వెలువడనున్నాయని చెబుతున్నారు.

Related Posts