న్యూఢిల్లీ అక్టోబర్ 6
లఖింపూర్ ఖేరీ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లకుండా రాజకీయ నాయకులను అడ్డుకుంటున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు. లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని కేజ్రివాల్ తప్పుపట్టారు. ఒకవైపు కేంద్ర సర్కారు 75 ఏండ్ల స్వాతంత్ర సంబురాలను నిర్వహిస్తోందని, మరోవైపు స్వాతంత్ర్య భారతదేశంలో బాధితులను పరామర్శించే హక్కు రాజకీయ నాయకులకు లేదా అని నిలదీశారు. బాధితులను కలువకుండా విపక్ష పార్టీ నాయకులను అడ్డుకోవడం వెనుక కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు.దేశ ప్రజలు లఖింపూర్ ఖేరీ ఘటన నిందితుడి అరెస్టుతోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా బర్తరఫ్‌ను కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి కేజ్రివాల్ సూచనచేశారు. ప్రధాని గారూ, నిందితుడిని అరెస్టు చేయాలని, కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు అని కేజ్రివాల్ వాఖ్యానించారు.