కడప
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, బద్వేలు మాజీ ఎమ్మెల్యే పి.ఎం కమలమ్మను ఎంపిక చేసినట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ముఖుల్ వాస్నిక్ నేడు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధిష్టానం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పి.ఎం కమలమ్మ పోటీ చేస్తున్నట్లు పి.సి.సి అధ్యక్షలు డాక్టర్ సాకే శైలజానాథ్ తెలిపారు. పోరుమామిళ్ల పట్టణానికి చెందిన పి.ఎం కమలమ్మ 20.2.1956లో జన్మించింది. ఎం.ఎస్. సి కెమిస్టీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా 30 సంవత్సరాలుగా పని చేస్తూ 2009లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2009 లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వుడు అయ్యాక నిర్వహించిన ఎన్నికల్లో పి.ఎం కమలమ్మ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎల్ చెన్నయ్య పై 36,590 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత మారిన రాజకీయాల్లో కమలమ్మ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2014 - 2017 వరకు జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యురాలుగా పనిచేశారు. ఏ.ఐ.సి.సి సభ్యురాలుగా, ఏ.పి.సి.సి కో -ఆర్డినేషన్ కమిటీ సభ్యురాలుగా 2019లో ఎన్నికల మేనిఫెస్టో కమిటీగా పని చేశారు. కమలమ్మ భర్త జె ప్రభాకర్, ఆమె కుమార్ కమల్ ప్రభాస్ కూడ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ నెల 7వ తేదీ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీనివాసరావు తెలిపారు.