YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో విమానాల ఉత్పత్తి కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో విమానాల ఉత్పత్తి కేంద్రం

- వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞానాలపై యూపీఎల్‌  సీఈవోతో భేటీ 
- ఆంధ్రప్రదేశ్‌ను ప్రయోగశాలగా చేసుకోవాలని విజ్ఞప్తి 
- బ్లాక్‌చైన్‌ టెక్నాలజీపై ఎథేరియంకు ప్రతిపాదన

 - సీఎం చంద్రబాబు చర్చలు 

ఆంధ్రప్రదేశ్‌లో సి-295 విమానాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకి ఎయిర్‌బస్‌ సంస్థకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని, అన్ని అనుమతులూ వెంట వెంటనే ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో ఆయన బుధవారం ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ సంస్థ సీఈవో డిర్క్‌ హోక్‌ తదితరులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎయిర్‌బస్‌ సంస్థ టాటా గ్రూప్‌తో కలసి ఈ విమాన తయారీ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని ఏపీ కోరుతోంది. ఎయిర్‌బస్‌ సంస్థ ప్రతినిధులు గత సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. రాష్ట్రాన్నీ సందర్శించారు. ‘‘ఈ ఏడాది చివరిలోగా ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నెలకొల్పుతాం’’ అని డిర్క్‌ హోక్‌ పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని తమ ఉత్పాదక  యూనిట్లను ఒకసారి సందర్శించాలని చంద్రబాబుని ఆయన ఆహ్వానించారు.

విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌ ఏర్పాటుకి ఆహ్వానం 
భారత్‌లో బోస్టన్‌ తరహాలో ఒక విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌ నెలకొల్పే ఉద్దేశంతో ఉన్నామని వేదాంత సంస్థ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని, అన్ని విధాలా సహకరిస్తామని సీఎం విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ చొరవను అనిల్‌ అగర్వాల్‌ ప్రశంసించారు.

బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ కోర్సు 
రాష్ట్రంలోని ఏదో ఒక విశ్వవిద్యాలయంలో మూడు నెలల బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ కోర్సు ప్రారంభించాలని ‘ఎథేరియం’ సంస్థ వ్యవస్థాపకుడు జో లుబిన్‌ను చంద్రబాబు కోరారు. ఈ టెక్నాలజీలో ఆ సంస్థకు చాలా అనుభవం ఉంది. భారతదేశంలో ఎక్కడా బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ కోర్సు లేదని, రాష్ట్రంలోని ఏదైనా యూనివర్శిటీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఎథేరియం సంయుక్తంగా బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ విభాగం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదించారు.

విరివిగా త్రీడీ ముద్రణ కేంద్రాలు 
ఆంధ్రప్రదేశ్‌లో విరివిగా త్రీడీ ముద్రణ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఈ పరిజ్ఞానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని హెచ్‌పీ సంస్థను ముఖ్యమంత్రి కోరారు. హెచ్‌పీ త్రీడీ ప్రింటింగ్‌ హెడ్‌ స్టీఫెన్‌ నిగ్రోతో ఆయన సమావేశమయ్యారు. రెండు నెలల్లో భారత్‌ పర్యటనలో భాగంగా అమరావతికి వస్తానని స్టీఫెన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో త్రీడీ ప్రింటింగ్‌ సెంటర్‌ ఏర్పాటు విషయమై హెచ్‌పీ భారత్‌ సీఈవోతో సంప్రదిస్తానని తెలిపారు.

ఫ్రాన్‌హోఫర్‌ ప్రతినిధితో భేటీ 
లీప్‌ఝిగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న టెక్నాలజీ రీసెర్చ్‌ సంస్థకు సంబంధించిన ఫ్రాన్‌హోఫర్‌ ప్రతినిధి తొబియాస్‌ డౌత్‌ తదితరులతో చంద్రబాబు సమావేశమయ్యారు. 20 వేల మంది ఉద్యోగులు కలిగిన ఈ సంస్థ ఐరోపాలోని అనేక కంపెనీలకు మార్కెట్‌ అనలైటిక్స్‌ సేవల్ని అందజేస్తోంది. ఫ్రాన్‌హోఫర్‌ క్లయింట్‌లుగా ఉన్న బీఎండబ్ల్యూ, బాష్‌ భారత్‌లో తమ వ్యాపార విస్తరణకు అవకాశాల్ని అన్వేషిస్తున్నాయి. ఫ్రాన్‌హోఫర్‌తో ఆంధ్రప్రదేశ్‌ కలసి పనిచేయడం వల్ల పలు సంస్థలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. లీప్‌ఝిగ్‌ను సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు.

రాష్ట్రం మొత్తం స్మార్ట్‌..! 
సింగపూర్‌లోని నన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ అధ్యక్షుడు సుబ్రా సురేష్‌ మాట్లాడుతూ తమ యూనివర్సిటీ ప్రాంగణాన్ని స్మార్ట్‌ క్యాంపస్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రాంగణంలో అంతర్గత రవాణాకి పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనాలే వినియోగిస్తున్నామని, 35 శాతం ఇంధనం ఆదా అవుతోందని వెల్లడించారు. తమది ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ అనుకూల క్యాంపస్‌ అని, ఒకసారి సందర్శించాలని ఆయన చంద్రబాబును కోరారు. ఆంధ్రప్రదేశ్‌ మొత్తాన్ని స్మార్ట్‌ రాష్ట్రంగా మార్చాలని భావిస్తున్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.

కరవు నియంత్రణ  ఆవిష్కరణలపై చర్చ 
భూమిలోని నీటిని గ్రహించి, ఆ నీటిని కరవు సమయంలో తిరిగి విడుదల చేసే సరికొత్త సాంకేతికతపై యూపీఎల్‌ సంస్థ గ్లోబల్‌ సీఈవో జైష్రాఫ్‌తో చంద్రబాబు చర్చించారు. ఈ సంస్థ ఒక ఎకరం విస్తీర్ణంలో 2 వేల లీటర్ల నీటిని గ్రహించే పరికరాల్ని ఉత్పత్తి చేస్తోంది. ఇది కరవుని నియంత్రించేందుకు దోహదం చేయడమే కాకుండా, 30 నుంచి 40 శాతం వరకు ఉత్పాదకతా పెంచుతుందని జైష్రాఫ్‌ వివరించారు. భూమిపై చల్లిన ఎరువులు భారీ వర్షాలకు కొట్టుకుపోయి వృథా కాకుండా సంరక్షించే మరో పరిజ్ఞానాన్ని సైతం తాము రూపొందించినట్టు ఆయన పేర్కొన్నారు. ఎరువుల వినియోగం తగ్గించడం, సమర్థ నీటి నిర్వహణ, సాగు ఖర్చుల్ని తగ్గించడం, ఉత్పాదకత పెంచడం తమ లక్ష్యాలుగా ఆయన వివరించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించండి మీ ఉత్పత్తులకు రాష్ట్రాన్ని ప్రయోగశాలగా చేసుకోండి’’ అని చంద్రబాబు కోరారు.

Related Posts