తిరుపతి, అక్టోబరు 7,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును వరస ఎన్నికలు కుదురుగా నిలవనిచ్చేట్లు లేవు. ఆయన పార్టీని బలోపేతం చేయాలని చేస్తున్న ప్రయత్నాలకు ఎన్నికలు అడ్డుపడుతున్నాయి. బద్వేలు ఉప ఎన్నిక నుంచి తప్పుకుని ఇక జిల్లాలను పర్యటించాలనుకుంటున్న సమయంలో కుప్పం నియోజకవర్గంలో మరో ఎన్నిక వచ్చి పడే అవకాశం కన్పిస్తుంది. త్వరలో కుప్పం మునిసిపాలిటీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయంటున్నారు.కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే చంద్రబాబు పట్టు కోల్పోయారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కుప్పంలో రివర్స్ సీన్ కనిపిస్తుంది. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కుప్పం నియోజకవర్గంలో వైసీపీ గెలుచుకుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలు అయిపోయిన వెంటనే చంద్రబాబు కుప్పం వెళ్లి పార్టీని గాడిన పెట్టే ప్రయత్నం చేశారు.కానీ పరిషత్ ఎన్నికల్లోనూ పార్టీకి కోలుకోలేని దెబ్బతగలడం, కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశముండటంతో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో త్వరలోనే పర్యటిస్తారంటు న్నారు. దసరా తర్వాత కాని, ముందు కాని చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించే అవకాశముంది. ఈసారి ఇక్కడ నాలుగు రోజుల పాటు చంద్రబాబు పర్యటించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ప్రధానంగా కుప్పంలోని టీడీపీ నేతలపై అసమ్మతి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరిని కట్టడి చేసేలా చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. అదే సమయంలో తనకు కుప్పం ప్రజల అండ ఎంత అవసరమో చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. మండలాల వారీగా నేతలతో సమావేశాలు జరపనున్నారు. దీంతో పాటు కుప్పం మున్సిపాలిటీ పరిధిలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై కూడా చంద్రబాబు ఈ సందర్భంగా దృష్టి పెట్టనున్నారు.