విశాఖపట్టణం, అక్టోబరు 7,
మన రాష్ట్రంలోని ప్రధాన ఓడ రేవు వైజాగ్ పోర్టు ట్రస్ట్ (విపిటి)ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) ముసుగులో పోర్టులోని బెర్తులన్నిటినీ కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఏడు బెర్తులు ప్రైవేట్ ప్లేయర్ల ఆధ్వర్యాన నడుస్తున్నాయి. తాజాగా మరో నాలుగు బెర్తులను ప్రైవేట్ ప్లేయర్లకు అప్పగించనున్నారు. క్రమంగా అన్ని బెర్తులనూ ప్రైవేట్ వారికి అప్పగించి పోర్టును నిర్వీర్యం చేయాలని చూస్తోంది. విపిటిలో ఇప్పటికే అదానీకి కేటాయించిన ఈక్యూ-1 టర్మినల్ బెర్తును 2019 సంవత్సరం నుంచి వ్యాపారం చెయ్యకుండా ఆయన వదిలేసి పోర్టుకు ఆదాయం లేకుండా చేశాడు. పైగా, రూ.వందల కోట్లు తాను నష్టపోయానంటూ, పోర్టు యాజమాన్యమే ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ పట్టుపట్టి కూర్చొన్నాడు. డబ్ల్యు క్యూ-6 బెర్తును కూడా ఎబిజి అనే ప్రైవేట్ ప్లేయర్ రెండేళ్లుగా వదిలేశాడు. ఇటువంటి అనుభవాలు పోర్టుకు ఉన్నా కొత్తగా నాలుగు బెర్తులను పిపిపి పేర కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ సహాయ మంత్రి శాంతన్ ఠాకూర్ రెండు రోజుల విశాఖ పోర్టు పర్యటనలో నాలుగు బెర్తులను పిపిపి కింద ఇచ్చే ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అదే సందర్భంలో దేశంలో మేజర్ పోర్టుల ప్రైవేటీకరణ బిల్లుపై స్పందిస్తూ, 'ప్రైవేటీకరణ నిర్ణయం ఇప్పట్లో లేదు' అని ప్రకటించారు. బిజెపి రెండు నాల్కల ధోరణికి ఇదొక తార్కాణం. తాత్కాలికంగా ఆదాయం వస్తుందనే కక్కుర్తితో తలూపి 'ల్యాండ్ లార్డ్ పోర్టు' హోదాతో పబ్బం గడపాలనే యాజమాన్యం తీరు పోర్టును సమీప భవిష్యత్తులో కష్టాల్లోకి నెట్టేసేలా ఉందంటూ ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆక్షేపిస్తున్నారు.విశాఖ పోర్టులో 26 టర్మినల్ బెర్తులు ఉన్నాయి. వీటి ద్వారా జరిగే కార్గో హేండ్లింగే (వ్యాపారమే) పోర్టుకు ప్రధాన ఆదాయవనరు. వీటిని వంద శాతం పోర్టే నిర్వహిస్తే ఆదాయమంతా పోర్టుదే. కానీ వీటిలో ఏడు బెర్తులను ఇప్పటికే ప్రైవేట్ ప్లేయర్లకు కట్టబెట్టేశారు. వీరిలో అదానీ, ఎస్సార్, వేదాంత, ఈక్యూ-10 (ఎవిఆర్ ఇన్ ఫ్రా), విఎస్‌పిఎల్- (గామన్ ఇండియా), విసిపిటిఎల్ -1 జెఎన్ బక్సీ గ్రూప్, విసిపిటిఎల్ -2 (జేఎన్ బక్సీ గ్రూప్) ఉన్నారు. ప్రస్తుతం విసిపిటిఎల్-2 విస్తరణ పనులు జరుగుతున్నాయి. విశాఖ ఓడరేవు సముద్రంలో 38 ఎకరాల్లో సముద్రాన్ని కప్పి కంటైనర్ టర్మినల్‌ను రూ.637 కోట్లతో విసిపిటిఎల్ యాజమాన్యం నిర్మిస్తోంది. ఈ కంటైనర్ టర్మినల్ బెర్త్ మరో 3 నెలల్లో పూర్తి కానుంది.కొత్తగా మరో నాలుగు బెర్తులను ప్రైవేట్ వారికి కట్టబెట్టనున్నారు. డబ్ల్యు క్యూ-7, 8-2 బెర్తుల (ఇన్నర్ హార్బర్‌లో)కు రూ.288 కోట్లతో త్వరలో టెండర్లు పిలిచేందుకు కేంద్రం అనుమతిని పోర్టు ఇప్పటికే కోరింది. ఈక్యూ-7 బెర్తు రూ.200 కోట్లతో అనుమతి కోసం పెట్టింది. డబ్ల్యు క్యూ-6 రూ.200 కోట్లతో ప్రతిపాదన ఉంది. దీన్నే రెండేళ్ల క్రితం ఎబిజి ప్రైవేట్ ప్లేయర్ వదిలేసి వెళ్లిపోగా తాజాగా అనుమతి కోసం మరలా పెట్టారు. నాల్గో బెర్తు ఈక్యూ-6 రూ.200 కోట్లతోనే ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. ప్రైవేట్ ప్లేయర్లు కార్గో వ్యాపారం చేసి సంపాదించే ప్రతి వంద రూపాయల్లో రూ.38 పోర్టుకు రెవెన్యూ షేర్ నెలనెలా వచ్చేలా బెర్తులను కొత్తగా టెండర్ల విధానం తీసుకొచ్చినట్లు పోర్టు అధికారులు చెబుతున్నారు. పోర్టు అవుటర్ హార్బర్‌లోగల వేదాంత ఈ పద్ధతిలోనే చెల్లిస్తోందని పోర్టు చెబుతోంది. డబ్ల్యు క్యూ-6 బెర్తు టర్మినల్‌ను ఎబిజి ప్లేయర్, అదానీ ఈక్యూ-1ను వదిలేసి వెళ్లిపోయి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకూ కొత్త ప్లేయర్లు రాలేదు. వీటిలో క్యూ-6కు తాజాగా టెండర్లు వేశారు.
విశాఖ పోర్టు తన సొంత నిధులతో బెర్తులన్నిటినీ నిర్వహిస్తే వంద శాతం రెవెన్యూ పోర్టుకే ఉంటుంది. పిపిపి ప్రాజెక్టులతో నష్టపోతోంది. క్రమంగా పోర్టు మొత్తం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయి ఈ బెర్తుల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండాపోతుంది. పిపిపితో లాభాలు వస్తాయన్న బిజెఇపి, పోర్టు యాజమాన్యం వాదన శుద్ధ అబద్దం. ఇందుకు అదానీ టర్మినల్ వ్యవహారమే తార్కాణం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక గతంలోనే పార్లమెంట్‌కు సమర్పిస్తూ పిపిపి వల్ల పోర్టులకు ఏ మాత్రమూ లాభం జరగలేదని, కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోవడం తప్ప ప్రయోజనం లేదని నివేదించింది.