ముంబై, అక్టోబరు 7,
దేశంలో బొగ్గు షార్టేజ్ భయపెడుతోంది. భారీ వర్షాలకు బొగ్గు గనుల్లో మైనింగ్ ఆగిపోవడం, ట్రాన్స్‌పోర్టేషన్‌కు ఇబ్బందులు కలగడం వంటి అంశాలతో పాటు, ఎలక్ట్రిసిటీ డిమాండ్ భారీగా పెరగడంతో కూడా ప్లాంట్లకు తగినంత బొగ్గు సప్లయ్ కావడం లేదు. వీటికి తోడు పవర్ ప్లాంట్లు కూడా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని బొగ్గు నిల్వలను పెంచుకోకపోవడంతో ప్లాంట్ల వద్ద కొరత పెరుగుతోంది. దేశంలోని 135 థర్మల్ పవర్ ప్లాంట్లలో రోజువారి బొగ్గు నిల్వలను లెక్కిస్తున్నారు. వీటిలో 72 ప్లాంట్ల వద్ద మూడు రోజుల కంటే తక్కువ రోజులకు సరిపడా నిల్వలు ఉండగా, వీటిలో 16 ప్లాంట్ల వద్ద నిల్వలు అయిపోవడం గమనించాలి. 50 ప్లాంట్ల వద్ద 4–10 రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయి. 13 ప్లాంట్ల వద్ద10 రోజుల కంటే ఎక్కువ రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు ఉన్నాయని పవర్ మినిస్ట్రీ డేటా ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం థర్మల్ ప్లాంట్లకు సగటున రోజుకి 60–80 వేల టన్నుల బొగ్గు కొరత ఉంది. దేశంలో 80 శాతం బొగ్గును సప్లయ్ చేస్తున్న కోల్ ఇండియా, డిమాండ్‌కు తగ్గ సప్లయ్‌ను పెంచుతామని ప్రకటించింది. వచ్చే వారం బొగ్గు సప్లయ్ మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ, అది కూడా వాతావరణంపై ఆధారపడి ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. కానీ, ఇప్పటికే నీళ్లు నిండిన బొగ్గు గనులు తిరిగి సాధారణ స్థాయికి చేరుకోవడానికి టైమ్ పడుతుందన్నారు. పవర్ సప్లయ్‌కు కోల్ ఇండియా ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. దీని కోసం అల్యూమినియం, స్టీల్ ప్లాంట్ల నుంచి థర్మల్ ప్లాంట్లకు బొగ్గును సప్లయ్ చేస్తోంది. దీనిపై ఈ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలోని పవర్ ప్లాంట్ల వద్ద ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 81 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. కిందటేడాది ఇదే టైమ్‌తో పోలిస్తే ఇది 76 శాతం తక్కువ. ఇండియన్ ఎక్స్చేంజిల్లో స్పాట్ కరెంట్ ధర కిలోవాట్‌కు 63 శాతం పెరిగి రూ. 4.4 కు చేరుకుంది. రెగ్యులేటరీ నుంచి అనుమతులొస్తే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ పెరిగిన ధరలను కన్జూమర్లకు మళ్లించే అవకాశాలు ఉన్నాయి.
చైనాలో కూడా పవర్ షార్టేజ్ వెంటాడుతున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రభుత్వం బొగ్గు ఎగుమతులపై రిస్ట్రిక్షన్లు పెట్టింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో బొగ్గు ధరలు 100 శాతం పెరిగాయి. ఈ ప్రభావం దేశ బొగ్గు దిగుమతులపై పడుతోంది. బొగ్గు దిగుమతుల ధరలు భారీగా పెరగడంతో దేశంలోని థర్మల్ ప్లాంట్లు డొమెస్టిక్ బొగ్గు పైనే ఆధారపడక తప్పడం లేదు. బొగ్గు క్రైసిస్‌పై ఇతర మినిస్ట్రీలతో కలిసి పనిచేస్తున్నామని పవర్ మినిస్టర్ ఆర్‌కే సింగ్ పేర్కొన్నారు. పవర్ డిమాండ్ భారీగా పెరిగిందని చెప్పారు. అక్టోబర్ చివరి 15 రోజుల్లో డిమాండ్ కొంత తగ్గొచ్చని అభిప్రాయపడ్డారు.