హైదరాబాద్ అక్టోబర్ 7
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది. అప్పుడు గ్రామాలు దారుణంగా ఉండేవి. ఒక పద్ధతిగా గ్రామాలు అభివృద్ధి చెందలేదు. అరాచకంగా, మురికి కూపాలుగా ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీల్లో విశేషమైన అభివృద్ధి జరిగింది. బోలెడన్ని అవార్డులు తెలంగాణ గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు వచ్చాయి.గతంలో పారిశుధ్య కార్మికులకు సరిగా జీతాలు ఇచ్చేవారు కాదు. గ్రామపంచాయతీలకు చార్జ్‌డ్ అకౌంట్ ఏర్పాటు చేశాం. జీతాలకు ఇబ్బంది లేకుండా వర్కర్లకు ముందుగా జీతాలు ఇచ్చేందుకు ఇది ఏర్పాటు చేశాం. గ్రామపంచాయతీలు మున్సిపాలిటీల్లో కలుస్తుంటే ప్రజలు సంతోషించాలి. కానీ ప్రజలు కోర్టుకు వెళ్తారు. ఎక్కడ కొత్తగా మున్సిపాలిటీలో చేరిన ఆ గ్రామాల అభివృద్ధికి కొన్ని నిధులు కేటాయించాం.2018 చట్టం తర్వాత 85 శాతం మొక్కలు బతికి ఉండకపోతే కమిషనర్, పంచాయతీ సెక్రటరీ, కౌన్సిలర్, సర్పంచ్ ఉద్యోగం పోతది అని చట్టంలో చెప్పాం. దీనిపై పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ పెట్టాం. లక్ష్యం సాధించేందుకు ఈ నిబంధన పెట్టాం. ఇండియాలోనే ప్రథమంగా కలెక్టర్ లోకల్ బాడీస్ అని పోస్టు పెట్టి, వాహనాలు కొనిచ్చాం. వీరు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధిని పర్యవేక్షిస్తారు. మాకున్న నివేదికల ప్రకారం 90 శాతం మొక్కలు పైబడి బతికి ఉన్నామని తెలిపారు. మొక్కలు బతకని గ్రామాలుంటే తమ దృష్టికి తీసుకువస్తే.. నిమిషాల వ్యవధిలోనే చర్యలు తీసుకుంటాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.