లక్నోఅక్టోబర్ 7
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసినట్లు ఆరోపణలున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కోసం గాలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఐజీ లక్ష్మీ సింగ్ గురువారం తెలిపారు. రైతుల హత్య కేసులో ఆయన పేరు నమోదైందని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, సమాచారం ఆధారంగా కూడా దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.మరోవైపు రైతులపైకి దూసుకెళ్లిన వాహనంలో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నాడని, నిరసన చేస్తున్న రైతులపై కాల్పులు జరిపినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. ఆశిష్ మిశ్రా వెంట ఆయుధాలు కలిగిన 15-20 మంది ఉన్నారని, వేగంగా మూడు వాహనాల్లో రైతులు నిరసన చేస్తున్న బన్‌బీర్‌పూర్‌కు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నారని అందులో పేర్కొన్నారు. మహీంద్రా థార్ వాహనం ఎడమ వైపు కూర్చొన్న మోను మిశ్రా తుపాకీతో కాల్పులు జరిపాడని, దీంతో రైతులు చెల్లాచెదురుకాగా వారిపైకి వాహానాన్ని దూకించారని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు.ఆదివారం లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా పాల్గొన్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు పక్కన నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆయన కాన్వాయ్‌లోని వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించగా, అనంతరం జరిగిన ఆందోళనలో మరో ఇద్దరు రైతులు, ఒక జర్నలిస్ట్, మరో ముగ్గురు కలిపి మొత్తం 8 మంది చనిపోయారు.రైతులపైకి దూసుకెళ్లి వారిని తొక్కించిన వాహనంలో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతు సంఘాలు ఆరోపించాయి. అయితే ఆ సమయంలో తన కుమారుడు ఆ వాహనంలో లేడని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాతోపాటు ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రా మీడియాకు తెలిపారు.