YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

నిలిచిన చేపల వేట

నిలిచిన చేపల వేట

వేసవి ప్రతాపానికి చెరువులు, కుంటల్లో నీరు అడుగంటుతోంది. దీంతో సాగు-తాగునీటికి సమస్యలు ఏర్పడుతున్నాయి. మరోవైపు జల వనరులనే ఆధారంగా చేసుకొన్న మత్సకారుల కుటుంబాలైతే ఆదాయమార్గం లేక విలవిల్లాడుతున్నాయి. చేపలవేటతో జీవనోపాధి సాగించే ఎన్నో కుటుంబాలు ప్రభావితమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. స్థానికంగా గోదావరి, ప్రాణహిత నదులు ఉన్నా ఈసారి రెండు నెలల ముందే ఎండిపోవడం ప్రారంభించాయి. దీంతో ఈ జలవనరులపై ఆధారపడ్డ అనేకమంది మత్స్యకారుల పరిస్థితి ఆగమ్యగోచరమైంది. రాత్రిపూట దీపం వెలుతురుతో నాలుగు చేపలు చిక్కితే అమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని స్థానిక మత్స్యకారులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కుటుంబపోషణ మరింత భారమవుతుందని, గుప్పెడు మెతుకుల కోసం అల్లాడిపోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  

 

గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో పెద్దమొత్తంలోనే మత్స్యకారులు జీవనాధారంగా చేపలవేటను కొనసాగిస్తున్నారు. వేమనపల్లి మండలంలోని దాదాపు 200లకు పైగా కుటుంబాలు ఈ నదుల ద్వారా ఏటా నాలుగు నెలల పాటు చేపలవేట ద్వారా ఉపాధి పొందుతున్నారు. గోదావరి నదిలో డిసెంబరులోనే నీరు అడుగంటి పోయింది. ఫలితంగా ఇక్కడ చేపలవేట పూర్తిగా నిలిచిపోయింది. మే నెలలోనూ నీటిప్రవాహంతో కళకళలాడే ప్రాణహిత నది సైతం ప్రాభవం కోల్పోయింది. ఈసారి ఏకంగా ఫిబ్రవరిలోనే అడుగంటడం మొదలెట్టింది. ప్రాణహిత ప్రస్తుతం పిల్లకాలువను తలపిస్తోంది. ఈ రెండు నదుల్లో నీరులేక చేపలవేట నిలిచిపోవడంతో మత్స్యకారులు ఆవేదనలో కూరుకుపోయారు. ప్రత్యామ్నాయం పనిలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదాయమార్గం లేక ఇంటిల్లిపాదీ పస్తులు ఉంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అనేక కులవృత్తులకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం తమను కూడా దృష్టించి ఉపాధి మార్గాలు చూపాలని మత్స్యకారులు విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts