YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రోత్సాహంతోనే ప్రయోజనం

ప్రోత్సాహంతోనే ప్రయోజనం

తెలంగాణను విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా తీర్చి దిద్దాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. అన్నిరకాల పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించేలా చర్యలు తీసుకుంటోంది. అంతేకాక పలు ప్రైవేట్ సంస్థలు సైతం రైతులతో విత్తనాలు సాగు చేయిస్తున్నాయి. ఇదంతా ఓ పార్శ్వం అయితే.. మరోవైపు.. రైతులు పండించిన విత్తనాలు పూర్తిస్థాయిలో కొనుగోలు కావడంలేదని సమాచారం. దీంతో రైతులకు నష్టాలు తప్పడంలేదని, పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి రైతన్నలకు అండగా ఉండాలని అంతా కోరుతున్నారు. రైతులే విత్తనాన్ని స్వయంగా తయారు చేసుకునేందుకు ప్రభుత్వం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం అమలు చేస్తోంది. మండలానికి ఒకటి రెండు గ్రామాలు ఎంపిక చేసి ఆసక్తి ఉన్న 15 నుంచి 25 మంది రైతులతో విత్తనాల సాగు చేయిస్తోంది. రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో హెక్టారుకు సరిపోయే విధంగా 30 కిలోల చొప్పున మూల విత్తనం (ఫౌండేషన్‌ సీడ్‌) ఇస్తోంది. సాగు చేసే విధానాలపైనా శిక్షణ ఇస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్న రైతులు ఉత్సాహంగా పండించిన విత్తనాలను తిరిగి ప్రభుత్వం కాని ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ కాని కొనుగోలు చేయడలేదు. దీంతో కర్షకులు మామూలు ధాన్యంతో కలిపే వాటినీ అమ్ముకుంటున్నారు. తిరిగి మళ్లీ సాగు సమయంలో ప్రైవేటు విత్తనాలనే ఆశ్రయిస్తున్నారు.

 

ఖరీఫ్‌లో ఎంత విత్తనం అవసరమవుతుందో యాసంగిలో...యాసంగికి ఎంత అవసరం అవుతుందో ఖరీఫ్‌లోనే అంచనా వేయాలి. ప్రతి గ్రామాన్ని  ఒక యూనిట్‌గా తీసుకుని ఆసక్తి ఉన్న రైతులను ఎంపిక చేయాలి. వారికి ఒక్కో ఎకరం సాగు చేసేలా మంచి దిగుబడి నిచ్చే వరివంగడం మూలవిత్తనం అందజేయాలని నిపుణులు సూచిస్తున్నారు.  విత్తనం సాగు చేసే రైతుకు ధరపై భరోసా కల్పించాలని స్పష్టంచేస్తున్నారు. విత్తనాలను ప్రభుత్వం  లేదా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కొనేలా ఒప్పందం చేసుకోవాలి అంటున్నారు. ఇలాంటి ప్రోత్సాహక చర్యలతో రైతు తాను సాగు చేసే పంటకు మంచి గిట్టుబాటు వస్తుందనే ఆశతో కల్తీలు లేకుండా సాగు చేస్తారని చెప్తున్నారు. మందమర్రి మండలం చిర్రకుంటలో విత్తనోత్పత్తి పథకం కింద రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ 25 మంది రైతులను ఎంపిక చేసి వీరికి మూల విత్తనం ఇచ్చి సాగుపై శిక్షణ ఇస్తున్నారు. పంట చేతికి రాగానే విత్తనాలు ఇతర రైతులు కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుంది. విత్తనాలను ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ కొనుగోలు చేసి రైతులకు తక్కువ ధరకు అందిస్తే కల్తీల బారిన పడకపోవడమే కాకుండా పెట్టుబడి కూడా తగ్గుతుందని నిపుణలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం, వ్యవసాయశాఖ ఈ అంశాలను దృష్టించి రాష్ట్రంలో విత్తనసాగు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. రైతన్నలు నకిలీ విత్తనాల బారినపడకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts