YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మానేరు పర్యాటకానికి సొబగులు

మానేరు పర్యాటకానికి సొబగులు

తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ మేరకు అన్ని రంగాలనూ అభివృద్ధి బాటలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటోంది. పర్యాటక రంగంలోనూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు పెద్దమొత్తమే వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రతీ నియోజకవర్గంలోనూ ప్రజలకు ఆహ్లాదం పంచేలా మినీ ట్యాంక్ బండ్లు నిర్మిస్తోంది. ఇదిలాఉంటే కరీంనగర్ లోనూ ఈ తరహా హంగులు ఇంకాస్త భారీగా ఉండనున్నాయి. ఎందుకంటే మానేరు జలాశయం వద్ద హరిత హోటల్ నిర్మించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఆహ్లాదం కోసం కరీంనగర్‌లోని మానేరు జలాశయం వద్దకు వచ్చే పర్యాటకుల కోసం మరిన్ని కొత్త సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకే ఈ హోటల్ ను నిర్మించనున్నారు. ఇప్పటికే పర్యాటకంగా అన్ని ప్రాంతాల వారిని ఆకర్షిస్తున్న ఈ జలాశయం వద్ద రానున్న రోజుల్లో మానేరు రివర్‌ఫ్రంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరితహోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. కరీంనగర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్న వీటి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. 

 

హరితహోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్ల కోసం కేంద్ర ప్రభుత్వం అడిషనల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌ కింద 2015లోనే రూ.15 కోట్లను మంజూరు చేశారు. స్థల నిర్ధారణ ఆలస్యం కావడంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఉజ్వల పార్కు వద్ద హరితహోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్లకు స్థలాన్ని నిర్ధారించారు. దీంతో ఈ నిర్మాణ పనులు త్వరలోనే మొదలవుతాయి. కరీంనగర్‌తో పాటు పలు ప్రాంతాల పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. అయితే ఇలా వచ్చేవారికి సేదతీరేందుకు సరైన అవకాశమే కాక ఆహారం కూడా అందుబాటులో ఉండడంలేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం హరితహోటల్, కన్వెన్షన్ సెంటర్ ను నిర్మిస్తోంది. హరితహోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుతో పర్యాటకులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాక ఈ నిర్మాణాలు సమావేశాలు, వేడుకలకూ వేదికగా మారనున్నాయి. మానేరు జలాశం, మానేరు రివర్‌ఫ్రంట్‌ సందర్శనకు వచ్చే పర్యాటకులు సేద తీరేలా, విశ్రమించేందుకు అవసరమైన గదుల సౌకర్యం వీటిల్లో ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. దీంతో స్థానికంగా పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందుతుందని, ఈ విభాగంలో ఆదాయం కూడా పెరుగుతుందని అంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Related Posts