YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిప్పుల కొలిమి

 నిప్పుల కొలిమి

వేసవి విజృంభిస్తోంది. మే నెల రావడంతో భానుడి నిప్పులు కురిపిస్తున్న పరిస్థితి. వాతావరణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో జనాలు హడలిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో టెంపరేచర్లు 42 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యాయి. దీంతో స్థానికులు ఠారెత్తిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదవుతాయన్న ఆందోళనలో కూరుకుపోయారు. జిల్లాలో ఉదయం 8 గంటల నుంచే ఉష్ణతాపం మొదలైపోతోంది. పది గంటలతైతే వేడిమి పెరిగిపోతుండడంతో చిన్నాపెద్దా అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉన్నా వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. ఎండకు హడలిపోయి.. పగటి పూట జనాలు ఇళ్లల్లోంచి బయటకు రావడంలేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ఉదయం 10 గంటల లోపు,  సాయంత్రం 4 దాటిన తర్వాతే పనులు చక్కపెట్టుకుంటున్నారు. ఉదయం పెరిగిపోతున్న ఉష్ణోగ్రత రాత్రి సమయాల్లోనూ తగ్గడంలేదు. దీంతో రాత్రిపూట జనాలు ఆరుబయటే ఎక్కువగా గడుపుతున్నారు. 

 

స్థానికంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఏసీలు, కూలర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. వీటికి అలవాటు పడిన వారు బయట ఒక్క నిమిషం కూడా నిలువలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఇంట్లోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక బయటి పరిస్థితి ఎలా ఉంటుందో ఈజీగానే ఊహించుకోవచ్చు. ఉష్ణోగ్రతలకు తోడు వడగాడ్పు తీవ్రతా పెరుగుతోంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో శీతల పానీయాలు, మజ్జిగ, కొబ్బరి బోండాలు, పండ్ల రసాలకు గిరాకీ పెరిగింది. ఆయా వ్యాపారస్తులకు బాగానే గిట్టుబాటు అవుతోంది. ఇదిలాఉంటే ఎండలు పెరిగిపోవడంతో ఉపాధి కూలీలు నానాపాట్లు పడుతున్నారు. పలు ప్రంతాల్లో పనుల సాగుతున్న చోట్ల నీడ కోసం టెంట్లు వేయడంలేదు. మంచినీరూ అందుబాటులో ఉండడంలేదు. ఈ సమస్యను గుర్తించి సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని పనులు సాగే ప్రాంతాల్లో టెంట్లు వేయడంతో పాటూ మంచి నీరు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Related Posts