విజయవాడ, అక్టోబరు 9,
తెలుగుదేశం పార్టీ లో పవన్ కల్యాణ్ ప్రభావం కన్పిస్తుందా? ప్రధానంగా జనసేనతో పొత్తు కుదుర్చుకుంటే తమ భవిష‌్యత్ ఏంటన్న బెంగ నేతలకు ఇప్పటి నుంచే పట్టుకుందా? అవును. ఇటీవల గత కొద్ది రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను టీడీపీ నేతలు కలుస్తున్నారు. తమ ప్రాంతంలో పర్యటించాలని కోరుతున్నారు. దీనికి ప్రధాన కారణం జనసేనతో పొత్తు ఉంటుందనే వార్తలు రావడమే.నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో కీలకంగా మారతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఆశీస్సులుంటేనే టిక్కెట్ అన్న అభిప్రాయం టీడీపీలో బలపడిపోయింది. మొన్నటి ఎన్నికల్లోనే నేతలు లోకేష్ చుట్టూ తిరిగి టిక్కెట్లు సంపాదించుకున్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడంతో టిక్కెట్ల కేటాయింపులో ఎటువంటి సమస్య రాలేదు. తాను అనుకున్న వారికి టిక్కెట్ అప్పగించారు.ఇక ఈసారి అలా కుదరదు. ఖచ్చితంగా టీడీపీ పొత్తులతో వెళ్లి తీరాల్సిందే. అది జనసేనతోనా? కమ్యునిస్టులతోనా? కాంగ్రెస్ తోనా? అన్నది పక్కన పెడితే పొత్తు మాత్రం గ్యారంటీ. దీంతో సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. జనసేనతో పొత్తు కుదిరితే దాదాపు నలభై స్థానాలకు పైగానే ఆ పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. ఈ భయమే నారా లోకేష్ వద్దకు నేతలు క్యూ కట్టేలా చేస్తుంది. ప్రధానంగా జనసేనతో పొత్తు కుదిరితే కొన్ని ప్రాంతాల టీడీపీ నేతలకు ఎఫెక్ట్ తప్పదు.ముఖ్యంగా పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు వంటి ప్రాంతాల్లో జనసేన టిక్కెట్లను ఎక్కువ కోరే అవకాశముంది. ఇక్కడ మాత్రమే జనసేన కొంత బలంగా ఉండటంతో టీడీపీ కూడా అక్కడే వారికి టిక్కెట్ కేటాయించాల్సి ఉంటుంది. అందువల్లనే ఈ ప్రాంత టీడీపీ నేతల్లో భయం పట్టుకుంది. అందుకే తమ పరిస్థితి ఏంటన్న విషయాన్ని చర్చించేందుకు నారా లోకేష్ ను నేతలు కలుస్తున్నారని చెబుతున్నారు. జిల్లాల పర్యటనలకు ఆయనను ఆహ్వానిస్తున్నారు.