YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

కొనబోతే కొరివి.. అమ్మబోతే అడివి..

 కొనబోతే కొరివి.. అమ్మబోతే అడివి..

ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉంది. దీంతో మంచి ధర దక్కుతుందని రైతులు భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు ఖమ్మం జిల్లాలోని మామిడి రైతులు వాపోతున్నారు. కొనబోతే కొరివి.. అమ్మబోతే అడివిలా ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అష్టకష్టాలు పడి సాగు చేసిన మామిడికి సరైన ధర రాకపోవడంతో ఈ ఏడాదీ ఆర్ధిక సమస్యలను గట్టెక్కడం కష్టమే అని అంటున్నారు. రైతులే కాక తోటల వ్యాపారులదీ ఇదే దుస్థితి. మండీలకు వచ్చే మామిడి కాయలకు ఏ రోజు ఏ ధర పలుకుతుందే అంతా దిల్లీ వ్యాపారి దయాదాక్షణ్యాలపైనే ఆధారపడి ఉంటోందని రైతులు అంటున్నారు. ఈ మాయాజాలం వల్లే సరైన ధర దక్కడంలేదని చెప్తున్నారు. జిల్లాలో 36 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 30శాతం మాత్రమే దిగుబడి వచ్చింది. మామిడి కాయలు నేరుగా రవాణా చేసి అమ్ముకునే పరిస్థితి రైతులకు, చిన్నవ్యాపారులకు లేదు. దీంతో గ్రామాల్లో మండీలపైనే ఆధారపడుతున్నారు రైతులు, తోటల వ్యాపారులు. 

 

దిల్లీ వ్యాపారుల ఆధ్వర్యంలోనిర్వహిస్తున్న ఈ మండీల్లో వారు చెప్పిందే ధర అవుతోంది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కడంలేదు. ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉండడంతో మంచి ధర పలుకుతుందని అంతా అంచనా వేశారు. తోటల వ్యాపారులైతే అధిక ధరలకు కాయలు కొనుగోలు చేశారు. ఈ నెల ప్రారంభంలోనే టన్ను గరిష్ఠ ధర రూ.80 వేలు చొప్పున వేసి తోటల వ్యాపారులకు ఎరచూపారు మండీల నిర్వాహకులు. దీంతో తోటల వ్యాపారులు టన్ను రూ.20 వేల నుంచి రూ.30 వేలు ధర పెట్టి తోటలు కొనుగోలు చేశారు. ఈ నెల ప్రారంభం నుంచే ఆఖరు వరకు పలువురు చిన్న వ్యాపారులు రూ.లక్షల్లో తోటలను కొని ఉంచుకున్నారు. ఈ దఫా మంచి మద్దతు ధర లభిస్తుందని భావించారు. అయితే ఢిల్లీ వ్యాపారులంతా సిండికేట్‌ గా మారి ధరలు తగ్గించడం ప్రారంభించారు. దీంతో అధిక ధరలకు తోటలు కొన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర పెరుగుతుందని తోటలు అమ్మకుండా అట్టే పెట్టుకున్న రైతుల దుస్థితి మరోలా ఉంది. తక్కువ ధర చెప్పినా.. అంతకే అమ్ముకునేందుకు వారు సిద్ధపడుతున్నారు.  

Related Posts