YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈసారి బాబు డబుల్ సీట్లు...

ఈసారి బాబు డబుల్ సీట్లు...

తిరుపతి, అక్టోబరు 9,
టీడీపీ అధినేత చంద్రబాబు చూడని రాజకీయం.. చూడని ఎత్తుపల్లాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఎక్కువ కాలం పని చేసిన ఘనత చంద్రబాబుకు ఉంది. అలాగే రాష్ట్ర విభజన తర్వాత కూడా నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొత్త రికార్డు సృష్టించారు. అలాంటి చంద్రబాబు తన రాజకీయం జీవితంలో ఎన్నడూ లేనివిధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కనీసం సొంత నియోజకవర్గంలోనూ పార్టీని గాడినపెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తుంది. దీంతో మున్ముందు టీడీపీ భవిష్యత్ ఏంటా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఐదేళ్లు అధికారం అనుభవించిన తర్వాత ఆయన ఎన్నికలకు వెళ్లారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి కేవలం 23సీట్లే దక్కాయి. దీంతో అధికారానికి దూరమైంది. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ క్రమంగా బలహీనమవుతూ వస్తోంది. టీడీపీ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు జగన్ కు జై కొట్టారు. దీంతో ఆ పార్టీలో ఇప్పుడెంత మంది ఉన్నారనేది అర్థం కావడం లేదు.జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఇప్పటికే రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. ఆయన పాలనపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కన్పించడం లేదు. రాష్ట్రంలోని ప్రతీఒక్కరూ ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్నారు. దీంతో ప్రజలు ఆయన వెంటే నడుస్తున్నట్లు కన్పిస్తుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ వైసీపీ జెండానే ఎగిరింది. ఈ పరిస్థితులను బేరీజు వేసుకున్న చంద్రబాబు తాజాగా దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.కుప్పం నియోజకవర్గం తొలి నుంచి టీడీపీ కంచుకోట. ఇక్కడి నుంచి చంద్రబాబు వరుసగా గెలుస్తూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా రాణిస్తున్నారు. టీడీపీ అధికారంలో లేకపోయినా పార్టీ బలంగా ఇక్కడ ఉండేది. అలాంటి కంచుకోటకు జగన్ సర్కారు హయాంలో బీటలు వారుతున్నాయి. కిందటి స్థానిక సంస్థల్లో వైసీపీ కుప్పంలో అత్యధిక స్థానాలు దక్కించుకోగా టీడీపీ కనీస పోటీ ఇవ్వలేకపోవడం ఇందుకు నిదర్శంగా కన్పిస్తుంది. దీంతో కుప్పంపై చంద్రబాబు ఆశలు వదులుకోవాల్సిందేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.రాబోయే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే చిన్నబాబు ఇక్కడ నుంచి పోటీ చేస్తే అసలుకే మోసం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో ఆయనే కుప్పం నుంచి మరోసారి పోటీ చేస్తారనే టాక్ విన్పిస్తుంది. ఇదిలా ఉంటే చంద్రబాబు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తే ఆ ప్రాంతంలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని సీనియర్ నేతలు సూచిస్తున్నారు. అయితే దీనిపై చంద్రబాబు ఏటూ తేల్చుకోలేకపోతున్నారట.కుప్పం తొలి నుంచి చంద్రబాబుకు సెంటిమెంట్ గా కలిసి వచ్చింది. ఈనేపథ్యంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని వదులుకునే ప్రసక్తి లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు కుప్పంలో గ్రామస్థాయి నుంచి ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు విశాఖ నుంచి చంద్రబాబు పోటీ చేస్తే బాగుంటుందని సీనియర్లు కోరుతున్నారు. దీంతో చంద్రబాబు రెండుచోట్ల నుంచే పోటీ చేస్తారనే ప్రచారం సైతం పార్టీలో జోరుగా నడుస్తోంది.అయితే చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతారా? లేదంటే సింగిల్ సీటుపైనే పోటీ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి గత అసెంబ్లీ ఎన్నికల నుంచి నిన్నటి ఎంపీటీసీ ఫలితాల వరకు చూస్తే టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీనం అవుతుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా కుప్పంపై టీడీపీ క్రమంగా పట్టు కోల్పోతున్నట్లే కన్పిస్తుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పార్టీని తిరిగి ఎలా గాడిన పెడుతారనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Related Posts