న్యూఢిల్లీ, అక్టోబరు 9,
కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీలు.. గాంధీలంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుకొస్తుంది. ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ చేజారిపోతే ఆపార్టీ బ్రతికి బట్టకట్టదనే ప్రచారం ఉంది. ఈ కారణంతోనే సోనియాగాంధీ ఎంత కష్టమైనా అధ్యక్ష బాధ్యతలను తానే మోస్తున్నారు. ఒక్కసారి అధ్యక్ష పీఠం చేజారితే ఏం జరుగుతుందో సోనియాగాంధీకి తెలుసు. అందుకే ఆమె అధ్యక్ష బాధ్యతలను ఇతరులకు కట్టబెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేయడం లేదు. ఇస్తేగిస్తే గాంధీ కుటుంబంలోని వారికేనని ఆమె ఖరాకండిగా చెప్పేస్తున్నారు. యూపీఏ సర్కారు హయాంలో సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. కొద్దినెలల క్రితం అనారోగ్య కారణాలతో ఆమె తప్పుకోగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవీని చేపట్టారు. అయితే అప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలైంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు లేకుండా పోయాడు. ప్రస్తుతం సోనియాగాంధీనే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతూ పార్టీని చక్కబెడుతున్నారు. సోనియాగాంధీ సీనియర్ల సలహాలను, సూచనలు పాటిస్తూ ముందుకెళుతుంటారు. రాహుల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటారు. దీంతో రాహుల్ అధ్యక్ష పదవీ ఉన్నప్పుడు సీనియర్లకు ఆయనకు పెద్దగా పడేది కాదనే ప్రచారం ఉంది. తన నిర్ణయాలు అమలు కాకుండా సీనియర్లు అడ్డుపడుతుంటంతో రాహుల్ తన అధ్యక్ష పదవీకి రాజీనామా చేసినట్లు మరోవాదన ఉంది. ఇక రాహుల్ అధ్యక్ష పదవీ నుంచి తప్పుకున్నాక సోనియాగాంధీ పార్టీలో ఆయన నిర్ణయాలనే అమలు చేస్తున్నారని సీనియర్లు భావిస్తున్నారు. రాహుల్ అధ్యక్ష పదవీ చేపట్టకుండా పార్టీలో సొంత నిర్ణయాలు అమలు చేస్తున్నారంటూ సీనియర్ల గుస్సా అవుతున్నారు. ఈక్రమంలోనే 23మంది సీనియర్లు అధినాయకత్వాన్ని ధిక్కరిస్తూ లేఖాస్త్రాన్ని సంధించారు. అప్పట్లో ఈ అంశం కాంగ్రెస్ లో పెను సంచలనంగా మారింది. అయితే సోనియాగాంధీ సీనియర్లకు నచ్చజెప్పడంతో పరిస్థితి తిరిగి సర్దుమణిగింది. ఈక్రమంలోనే రాహుల్, ప్రియాంక గాంధీలు సీనియర్లకు పొమ్మనలేక పొగబెడుతున్నారు. అదే సమయంలో తనకంటూ ఓ టీమును రెడీ చేసుకుంటున్నారు. జరుగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పక్కన పెడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వీరి సేవలను ఉపయోగించుకోకూడదని పార్టీ భావిస్తుందట. ఇదే సమయంలో రాహుల్, ప్రియాంక సన్నితులు, కొందరు జాతీయ స్థాయి నేతలను ఆయా రాష్ట్రాలకు పంపించి ప్రచారం చేయనున్నారు. రాహుల్, ప్రియాంక అనుచరులకు పెద్దపీఠ వేయడం ద్వారా సీనియర్లకు పార్టీలో చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక మార్క్ స్పష్టంగా కన్పించనుంది. ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతారనే ప్రచారం కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. ఈలోగా రాహుల్, ప్రియాంక గాంధీలు తమకంటూ ఓ టీమును సెట్ చేసుకునే పనిలో పడ్డారని సమాచారం. ఈ టీముతోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు రాహుల్ గాంధీ వెళుతారనే టాక్ విన్పిస్తుంది. మరీ రాహుల్ నిర్ణయంపై సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది.