విజయవాడ, అక్టోబరు 9,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో అనుకున్నట్లే జరుగుతుంది. ఆయన మూడు రోజుల హడావిడి అన్నట్లుగానే రాజకీయానికి ఇంటర్వెల్ ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అంతటా మార్చేస్తానని చెప్పి ఇటు రాజమండ్రి, అటు అనంతపురం జిల్లాలో హల్ చల్ చేసిన పవన్ కల్యాణ్ మళ్లీ స్మాల్ బ్రేక్ ఇచ్చినట్లే కనపడుతుంది. మళ్లీ ఆయన మేకప్ వేసుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్ పై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు ఆయనే అవకాశమిస్తున్నట్లయింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు పర్యటించి పవన్ కల్యాణ్ రచ్చ రచ్చ చేశారు. కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. అలాగే ఫిలిం ఇండ్రస్ట్రీలో టిక్కెట్ల ఆన్ లైన్ అమ్మకంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పతాక శీర్షికల్లో నిలిచారు. వచ్చే ఎన్నికలలో జనసేనదే అధికారమన్నారు. వైసీపీకి 15 సీట్లు కూడా రావని చెప్పి వెళ్లిపోయారు. చూసుకుందాం రా అని సవాల్ విసిరి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.అందుకే పవన్ కల్యాణ్ ను ప్రజలు కూడా సీరియస్ పొలిటీషయన్ గా చూడటం లేదు. అంతలావున వైసీపీ ప్రభుత్వంపై రంకెలు వేసి, దమ్ముందా? చూసుకుందామా? అని సవాలు విసిరి.. చివరకు బద్వేల్ ఎన్నికలో తాము పోటీ చేయడం లేదని చెప్పి ఆ సీరియస్ గా ఉన్న రాజకీయాలను కామెడీ చేేసేశారు. తుస్సు మనిపించారు. ఇక టీడీపీతో పొత్తు ఉంటుందన్న సంకేతాలు కూడా ఇచ్చి వెళ్లారు.ఇలా ప్రతి ఎన్నికకు పొత్తులను మారుస్తూ వెళుతున్న పవన్ కల్యాణ్ ను ఎవరు నమ్ముతారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. 2014లో టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారు. 2019 ఎన్నికల్లో ఆ రెండింటికి దూరమై కమ్యునిస్టులతో జత కట్టారు. కమ్యునిస్టులను వదిలేసి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీతో జట్టుకట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జనం హర్షిస్తారా? ఆయన అంటున్న విలువలతో కూడిన రాజకీయాలు ఇవేనా అన్న సందేహం కలుగుతుంది. మొత్తం మీద పవన్ కల్యాణ్ మూడు రోజులు చేసిన రచ్చ ముగిసింది. ఆయన కూడా ప్రశాంతంగా షూటింగ్ లలో మునిగిపోయినట్లుంది.