YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మొక్కవోని నిర్లక్ష్యం

మొక్కవోని నిర్లక్ష్యం

 హరితహారంపై నిర్లక్ష్యం జిల్లాలో కనిపిస్తోంది. పచ్చని ప్రగతికి విఘాతం కలుగుతోంది. నీళ్లందించడంలో నిర్లక్ష్యం.. సంరక్షణలో అలసత్వం వెరసి మొక్క ఎండిపోతోంది. బతికేందుకు అవకాశం లేక చచ్చిపోతోంది. పక్కాగా సాగని పర్యవేక్షణలు.. మొక్కుబడి వ్యవహారాలు శాపంగా మారుతున్నాయి. కాగితాలకే పరిమితమవుతున్న లెక్కలు.. సమీక్షల్లోనే కాపాడే చర్యలు అసలు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించిన హరిత కార్యక్రమాన్ని చతికిల పడేలా చేస్తున్నాయి.  నాటిన ప్రతిమొక్కను కాపాడాలనే క్రతువు ఉమ్మడి జిల్లాలో పక్కాగా అమలవడం లేదు. కొరవడుతున్న పౌరస్పృహతోపాటు అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడం మరింత ఇబ్బందిని పెంచుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కనిపిస్తున్న ఇబ్బంది తీరు.. యంత్రాంగం చూపించాల్సిన చొరవ.. ముందుచూపులో డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

పచ్చదనం ప్రగతి అగమ్యగోచరంగా మారుతోంది. నాటిన వాటిలో బతికేవాటి తీరు విషయంలో ఇబ్బందికర పరిస్థితి అగుపిస్తోంది. నాలుగు జిల్లాల పరిధిలో అటు డీఆర్డీఏ, ఇటు అటవీశాఖ ఆధ్వర్యంలో నాటిన వాటి విషయంలో కొన్ని చోట్ల పరిశీలనలు జరపగా 50శాతం మేర మొక్కలు ఎండిపోయినట్లు అధికారులు గుర్తించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నాటిన మొక్కల్లో 53.68శాతం మొక్కలు బతికి ఉన్నట్లు గుర్తించారు. ఈ జిల్లాలో మొక్కల లక్ష్యం 80లక్షలు కాగా అంతకు మించి మొత్తంగా 81,97,480 నాటారు. ఇందులో ఇళ్ల చెంతనే 11,24,767 పెట్టారు. మిగతా 70,72,713 మొక్కల్ని వివిధ ప్రాంతాల్లో పెరిగేలా చూసారు. వీటన్నింటిలో 33,10,406 మొక్కల్ని పరిశీలించగా ఇందులో 17,77,139 మాత్రమే బతికి ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో డీఆర్డీఏ విభాగం ఆధ్వర్యంలో నాటిన వాటిలో 37.34శాతం మొక్కలు బతికినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ పట్టణాలు, గ్రామాల్లో కలిపి డీఆర్డీవో ఆధ్వర్యంలో 50లక్షల మొక్కల్ని పెంచాలనే లక్ష్యంలో 36,35,231 మొక్కల్ని పెట్టగలిగారు.  వివిధ ప్రాంతాల్లో కలిపి 27,81,126, ఇళ్లచెంతన 8,54,105 మొక్కల్ని నాటారు. వీటిన్నింటిలో 21,55,534 పరిశీలించగా 8,04,839 మాత్రమే బతికి ఉన్నట్లు తేలింది. అదే కరీంనగర్‌ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా కేవలం 34శాతం మాత్రమే ప్రగతి కనిపించడం కార్యక్రమం పట్ల ఉన్న ఆసక్తిని చూపిస్తోంది. జగిత్యాల జిల్లాలోనూ పరిశీలించిన వాటిలో 40శాతం మాత్రమే బతికినట్లు ప్రగతి తీరు కళ్లకుకడుతోంది.

హరిత జిల్లాలుగా మార్చాలనే సర్కారు సంకల్పానికి విరుద్ధంగా సంరక్షణ తీరు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నా ప్రగతి తీరులో మాత్రం ఆశించిన మార్పు కనిపించడంలేదు. కరీంనగర్‌, జగిత్యాల సహా పలు పట్టణాల్లో  హరిత ఆశయాన్ని అధికారులు చెవికెక్కించుకోవడం లేదు. ఆయా విభాగాలకు వీటి విషయంలో పట్టింపు కరవవుతోంది. దీంతో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన హరితహారం కార్యక్రమానికి కష్టకాలం కనిపిస్తోంది. ఇన్నాళ్లుగా కనిపించిన ఇక్కట్లకుతోడుగా ఈ వేసవిలో మరింత ఇబ్బంది మొక్కకు ఎదురవుతోంది. నీళ్లు పోయడంలోనే ఎక్కువగా నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గతానికి భిన్నంగా 2017-18వ సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు నడుంబిగిస్తామని ప్రతినబూనారు. కానీ వాటిని కాపాడేందుకు పాటుపడుతున్నతీరు మాటల్లోనే తప్పా.. చేతల్లో కనిపించడంలేదు. కళ్లెదుటే రోడ్లపక్కనే మొక్కలు కిందకు వాలినా వాటిని సరిచేయడం లేదు. రాష్ట్రస్థాయిలోనే కరీంనగర్‌ జిల్లాలో అత్యల్ప(0.16శాతం) అటవీ విస్తీర్ణముంది. భూవిస్తీర్ణంలో 3.47కి.మీ మేరనే అడవులున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 13.64శాతం, జగిత్యాల జిల్లాలో 22.94శాతం, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 18.78శాతంమేర అడవులున్నాయి. చెట్లను మరింతగా పెంచితేనే జిల్లాలో అనుకున్న విధంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు కనిపించనున్నాయి. ఆ దిశగా కలిసికట్టుగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది.

Related Posts