శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించాలంటే ముందుగా అది మనలో ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. యూకేకు చెందిన ఈస్థర్ వాల్డెన్ డయాబెటిస్‌కు సంబంధించి సీనియర్ క్లినికల్ అడ్వైజర్. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడం ద్వారా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం, కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఈ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఒక చిన్న గ్లాసు జ్యూస్ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని 15 నిమిషాల్లో తగ్గించవచ్చని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న డయాబెటిక్ పేషెంట్లను రెండు గ్రూపులుగా విభజించి, వారిలో ఒక గ్రూప్‌కు 230 మిల్లీలీటర్ల చక్కెర నీళ్లు, మరో గ్రూప్‌కు 230 మిల్లీలీటర్ల దానిమ్మ జ్యూస్ ఇచ్చారు. దానిమ్మ జ్యూస్ శరీరంలో గ్లూకోజ్‌ను తగ్గించడాన్ని పరిశోధకులు గమనించారు. దానిమ్మ జ్యూస్ తీసుకున్న వారిలో 15 నిమిషాల వ్యవధిలోనే షుగర్ లెవల్స్ తగ్గిపోగా, చక్కెర నీళ్లు తీసుకున్న వారి షుగర్ లెవల్స్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు.దానిమ్మలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇది గ్రీన్ టీలో, రెడ్ వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కంటే మూడు రెట్లు అధికంగా యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్ లేదా ఫ్రీ రాడికల్స్‌వల్ల కలిగే వ్యాధులతో పోరాడతాయి. దానిమ్మ గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయని కూడా నిపుణులు చెప్పారు. అందుకే ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రత్యేకమైన, ప్రయోజనకరమైన ఫలంగా చెప్పవచ్చు.అంతేగాకుండా దానిమ్మలో చాలా తక్కువ మొత్తంలో పిండి పదార్థాలుంటాయి. 100 గ్రాముల దానిమ్మలో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) కేవలం 19 శాతం మాత్రమే. కార్బోహైడ్రేట్‌లు వేగవంతమైన జీవక్రియ కలిగిఉంటాయి. దాంతో రక్తంలో చక్కెర స్థాయి తొందరగా పెరుగుతుంది. అందుకే పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం మధుమేహులకు అనర్థదాయకం. కాబట్టి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే దానిమ్మపండు మధుమేహులకు చాలా ప్రయోజనకరమైన పండు.
డయాబెటిస్‌ను తగ్గించే మరికొన్ని మర్గాలు
డైలీ వాకింగ్: ఆప్టిబాక్ ప్రోబయాటిక్స్‌లో న్యూట్రిషనల్ థెరపిస్ట్‌గా పనిచేస్తున్న క్యారీ బీసన్.. సాధారణ నడక కూడా ఒక వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుందని చెప్పారు. వాస్తవానికి నడక హృదయ స్పందన రేటును పెంచుతుంది. దాంతో శ్వాస వేగవంతం అవుతుంది. ఈ కారణంగా రక్తం మన శరీరంలోని ప్రతి భాగానికి చేరుకుంటుంది. కండరాలు ఉత్తేజితమవుతాయి. అందువల్ల మధుమేహులు ప్రతి రోజు 15 నుంచి 30 నిమిషాలు నడవడం మంచిది.
ఒత్తిడిని తగ్గించుకోవడం: మీకు ప్రతిరోజూ నడవడం వీలుపడకపోతే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే కొన్ని వ్యాయామాలు చేయవచ్చని క్యారీ బీసన్ చెప్పారు. ఇందుకు యోగా బాగా తోడ్పడుతుంది. యోగా ద్వారా కూడా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చని ఆయన తెలిపారు. అంతేగాకుండా మధుమేహులు ఎప్పుడు కూడా తమ శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందుకోసం ప్రతిరోజూ కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి.
తీపి పదార్థాలకు దూరం: అధిక చక్కెరలుగల ఆహారం మన రక్తంలో చక్కెర స్థాయిని కూడా ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా మనం చక్కెర అధికంగా ఉండే ప్రాసెస్ చేయబడిన, శుద్ధిచేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కూడా తగ్గించాలి. అదేవిధంగా చక్కెర పానీయాలు, తెల్ల అన్నం, తెల్లటి బ్రెడ్‌లను తినడం మానుకోవాలి.
వీటిని పాటిస్తే మరో పదికాలాలపాటు జీవింన్చవచ్చునని వైద్య నిపుణులు చెపుతున్నారు.