విజయవాడ, అక్టోబరు 11,
సరుకు రవాణ చేసే గూడ్స్ రైళ్లు మహా అయితే 50 నుంచి 80 బోగీలు ఉంటాయి. ఇండియన్ రైల్వేలకు సరుకు రవాణా ద్వారానే అధిక మొత్తంలో ఆదాయం వస్తుంది. అయితే, ఎక్కువ గూడ్స్ రైళ్లను నడపడం వలన ప్రజా రవాణా రైళ్లకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ ఇబ్బందులను తొలగించేందుకు ఇండియన్ రైల్వే వ్యవస్థ అనేక ప్రయోగాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే 176 బోగీలు, 6 రైలు ఇంజన్లతో కూడిన త్రిశూల్ రైలును తయారు చేసింది. ఇది పూర్తిగా సరుకు రవాణా కోసం రూపోందించిన రైలు. దాదాపు 2.40 కిలో మీటర్ల పొడవైన ఈ రైలు ముందు భాగంలో రెండు ఇంజన్లు, మధ్యలో రెండు ఇంజన్లు, చివర రెండు ఇంజన్లు వినియోగించి ప్రయోగాత్మకంగా నడిపించారు. గంటకు 50 కిలోమీటర్లతో ఈ రైలు దూసుకుపోయింది. విజయవాడ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే చివరి అంచు దువ్వాడ వరకు రైలును నడిపించారు. ఈ త్రిశూల్ రైలుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మూడు రైళ్ల కోసం వినియోగించే సిబ్బందిని ఒక్క రైలుకు ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, ఎక్కువ మొత్తంలో డిమాండ్ ఉన్న సరుకులను ఈ రైళ్ల ద్వారా సరఫరా చేయవచ్చు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ త్రిశూల్ రైళ్లు అందుబాటులోకి తీసుకురానున్నారు.