విజయవాడ, అక్టోబరు 11,
రాజకీయాల్లో ఎక్కడ చక్రం తిప్పాలన్నా కూడా నాయకుల సహకారం, సమష్టి కృషి చాలా అవసరం. అయితే, ఈ వ్యూహం ప్రస్తుతం టీడీపీలో కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. తాజాగా చంద్రబాబు నియమించిన పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంచార్జుల విషయంలో స్థానికంగా ఉన్న నాయకులు కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా విజయవాడ పార్లమెంటరీ జిల్లా నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా ఔట్ డేటెడ్ నాయకుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ కు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. అయితే, ఈయనపై ఇప్పటికే గుస్సాగా ఉన్న నాయకులు మున్ముందు కలిసివస్తారా ? అనేది సందేహం.బెజవాడ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని నాయకులు నెట్టెం రఘురామ్ తో అస్సలు కలిసి వచ్చే అవకాశం లేదు. నందిగామ రాజకీయాల్లో కీలకంగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు ఆయన అన్న దివంగత మాజీ మంత్రి దేవినేని వెంకట రమణ జీవించి ఉన్నప్పటి నుంచి నెట్టెం వర్సెస్ దేవినేని అన్నట్టుగా రాజకీయాలు నడిచేవి. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా జగ్గయ్యపేటలో నెట్టెం గెలిస్తే తమకు మంత్రి పదవి రాదని దేవినేని సోదరులు ఆయనకు వ్యతిరేకంగా చక్రం తిప్పేవారని.. అలాగే నందిగామలో దేవినేని సోదరులకు వ్యతిరేకంగా నెట్టెం రఘురామ్ వ్యవహారాలు నడిపేవారన్న టాక్ అప్పటి నుంచే ఉంది.నాటి నుంచి నేటి వరకు రాజకీయ రేసులో నెట్టెం రఘురామ్ వెనకపడిపోయి, దేవినేని ఉమా పైచేయి సాధించినా కూడా వీరి మధ్య పొరా పొచ్చలు అలాగే ఉన్నాయి. నందిగామ, మైలవరం ప్రస్తుతం ఉమా కనుసన్నల్లో ఉండడంతో అక్కడ నెట్టెం రఘురామ్ చేసేదేం ఉండదు. అదే సమయంలో విజయవాడ ఎంపీ నాని కూడా నెట్టెం రఘురామ్ తో కలిసి పనిచేయడం కష్టమేనని అంటున్నారు. నానికి, నెట్టెంకు మధ్య కూడా పెద్దగా సఖ్యత లేదట. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన నాని పార్టీ అధిష్టానాన్నే లెక్క చేయట్లేదు. ఈ నేపథ్యంలో నెట్టెం రఘురామ్ లాంటి మాటలను ఆయన పట్టించుకునే ఛాన్సులే లేవు.ఇక, జగ్గయ్య పేటలో శ్రీరాంతాతయ్య రెండు సార్లు గెలిచారు. గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక్కడ 1999, 2004 ఎన్నికల్లో నెట్టెం రఘురామ్ ఓడిపోగా 2009లో ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నారు. మధ్యలో తాతయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఇప్పటకీ నెట్టెం రఘురామ్ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈ పరిణామాలతో తాతయ్య సైతం అసహనంతోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా నెట్టెం రఘురామ్ దారిలో నడవడం కష్టమేనని చెబుతున్నారు. అదే సమయంలో నెట్టెం సొంత బావ .. తొండెపు దశరథ జనార్దన్‌తోనూ నెట్టెంకు విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంటరీ జిల్లా ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ నెట్టెం రఘురామ్ పార్టీని ఏమేరకు ముందుకు తీసుకువెళ్తారనేది సందేహమేనని అంటున్నారు పరిశీలకులు. మరి ఏంచేస్తారో ? చూడాలి.