ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నాటికి జిల్లాలో ప్రముఖ నేతలే పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు సైతం ముందుండి పార్టీని నడిపించారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సభలను, పర్యటలను జయప్రదం చేయడంలోనూ కీలకంగా వ్యవహరించారు. కార్యకర్తలను నడిపించడంలో నేతలే ముఖ్యపాత్ర పోషించారు. ఒక దశలో తెలుగుదేశం పార్టీకి ధీటు మేమేనన్న ధీమాను నాయకులు వ్యక్తం చేశారు. ఆ స్థాయికి పార్టీని తీసుకువెళ్లగలిగారు. ప్రజల్లో ఒక వేవ్‌ను తేగలిగారు. అది ఆనాటి మాట. మరి నేడు...పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మరో భిన్నమైన పరిస్థితిలో ఉంది. ఆ రోజుల్లో ఉన్న పెద్దల వంటి నాయకులు ఇప్పుడు కానరావడం లేదు. అభిమాన సందోహమే కార్యకర్తలుగా ముందుంటున్నారు.
ప్రత్యేక హోదా, ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు పవన్‌బస్సు యాత్రను ప్రారంభించ నున్నట్టు ప్రకటించడంతో జనసేన పార్టీలో జోష్ వచ్చింది. అయితే ప్రజారాజ్యం మాదిరిగా నాయకత్వం ముందుకు రావడం లేదు. అంతా పవన్ అభిమానులే పార్టీ సైన్యంగా ముందుంటున్నారు. భీమవరం పట్టణానికి చెందిన బొమ్మదేవర శ్రీధర్‌కు జనసేన జిల్లా బాధ్యతలు అప్పగించారు. ప్రజారాజ్యంలో కీలక పాత్ర వహించిన నర్సాపురం పట్టణానికి చెందిన కలవుకొలను తులసి జనసేనలోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కోశాధికారిగా ఏలూరు నగరానికి చెందిన రాఘవయ్య వ్యవహరిస్తు న్నారు. మిగిలిన వారంతా అభిమాన సైన్యమే. ఇప్పటిదాకా నియోజకవర్గాల సమీక్ష నిర్వహించడంలోనూ అభిమానులే కార్యకర్తలు గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్య నాయకత్వం విషయంలో మాత్రం జనసేనలో ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు రాష్ట్రంలో 175 నియోజక వర్గాల్లోనూ పోటీ చేయనున్నట్టు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. మరోవైపు ప్రతిజిల్లాలోనూ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బస్సు యాత్ర సందర్భంగా జిల్లాలోనూ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడానికి నాయకులు చర్యలు తీసుకున్నారు.
ఏలూరులోని అశోక్ నగర్‌లో ఇప్పటికే ఓ భవనాన్ని పార్టీ కార్యాలయంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బస్సు యాత్రను విజయవంతం చేయడానికి కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వ విషయంలో వినూత్న ప్రయోగం చేశారు. ఆన్‌లైన్‌లో సభ్యత్వానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో వేలాదిగా ఆన్‌లైన్ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయను న్నట్టు ప్రకటించడంతో మున్ముందు ఆశావహు లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రజారాజ్యం మాదిరిగా ముఖ్య నాయక త్వంగానీ, పెద్దలుగానీ లేకపోవడంతో జనసేనలో ప్రస్తుతానికి ఒక వెళితిగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఆ లోటు తీర్చేదిశగా ఆశావహులు ముందుకు రానున్నారన్న ధీమా జనసేన కార్యకర్తల్లో కనిపిస్తోంది.