హైదరాబాద్, అక్టోబరు 11,
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కోచోట ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణలోని హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోరు ఉత్కంఠగా మారింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని కడపలో జిల్లాలోనూ ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీకి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఏకపక్షమేననే టాక్ విన్పిస్తోంది.తెలంగాణలోని హుజూరాబాద్ లో ఐదు నెలల ముందు నుంచే ఎన్నికల వేడిరాజుకుంది. ఈ ఉప ఎన్నికను ఈటల రాజేందర్ తోపాటు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఇక్కడి పోరు రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ఈటల ఈసారి బీజేపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ మాత్రం వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమనే సంకేతాన్ని ఇచ్చేందుకు సిద్ధవుతున్నారు. దీంతో ఈ ఉప ఎన్నికలో ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారు అనేది ఆసక్తిని రేపుతోంది.హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గతంలో చేసిన అభివృద్ధి, సానుభూతి పవనాలు ఆయనకు కలిసి రానున్నాయి. అయితే ఆయన వెంట ఉండే నాయకులు క్రమంగా టీఆర్ఎస్ లోకి వెళుతుండటం ఆయనకు మైసస్ గా మారుతోంది. ఇదే సమయంలో ఈటలకు బీజేపీ పెద్దల నుంచి సహకారం లభిస్తుండటంతో ఆయన ఎలాగోలా ఈ ఎన్నికల్లో గట్టెక్కుతారనే టాక్ విన్పిస్తుంది. ఇప్పటికే బీజేపీ పెద్దలతోపాటు స్థానిక నేతలు రంగంలోకి దిగి హుజూరాబాద్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.మరోవైపు టీఆర్ఎస్ మరో రెండేళ్లు అధికారంలో ఉండటం ఆపార్టీకి కలిసి రానుంది. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతోపాటు కొత్తగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాలను తమ అభ్యర్థిని గెలిపిస్తాయని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. ఆయనకు తోడుగా మంత్రులు గుంగుల కమాలకర్, కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్లో వీరంతా పని చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.హుజూరాబాద్ కాంగ్రెస్ పోటీలో ఉన్నా నామమాత్రంగానే కన్పిస్తుంది. ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యేనని స్పష్టమవుతోంది. నిన్నటితో నామినేషన్లు ముగియగా మొత్తంగా 61మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 11 నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంది. అప్పటికి మరికొంత మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఏదిఏమైనా హుజూరాబాద్లో మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది.మరోవైపు బద్వేల్లో మాత్రం వైసీపీ గెలుపు ఏకపక్షంగా కన్పిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కడప జిల్లాను వైసీపీ క్వీన్ స్లీప్ చేసింది. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సొంత జిల్లాలోనే ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీ నుంచి వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధ బరిలో ఉన్నారు. వైసీపీకి అంతో ఇంతో పోటీ ఇచ్చే టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకోవడంతో ఆపార్టీకి గెలుపు మరింత ఈజీగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ లు పోటీలో ఉన్నా వాటికి గెలిచే సత్తా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.వైసీపీ గెలుపు ఖాయమనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆపార్టీ కేవలం మెజార్టీపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇక నామినేషన్లు ముగిసే నాటికి బద్వేల్ లో 35మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉప సంహరణకు ఇంకా సమయం ఉండటంతో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. మొత్తానికి హుజూరాబాద్లో ఉత్కంఠ పోరు నడవనుండగా బద్వేల్ లో మాత్రం చప్పగా సాగే అవకాశం కన్పిస్తుంది. దీంతో అందరిచూపు హుజూరాబాద్ ఉప ఎన్నిక రిజల్ట్ పైనే పడుతోంది.