హైదరాబాద్, అక్టోబరు 11,
చారిత్రక ఖిల్లా వరంగల్ కోటను ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆదివారం సందర్శించారు. కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా రాంగోపాల్ వర్మ ‘కొండా’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ అంతా కూడా వరంగల్ పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుందని వర్మ ముందే వెల్లడించారు. కొండా మురుళి జీవితంలోని పలు కీలక ఘట్టాలపై సన్నివేశాలను చిత్రీకరించేందుకు వరంగల్‌లో రాంగోపాల్ వర్మ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఖిల్లా వరంగల్‌ను సందర్శించారు.ఇదిలా ఉండగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే వర్మ 1990ల్లోని తెలంగాణ ఫ్యాక్షన్ రాజకీయాలను తెరమీద చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో కొండా మురళిని ఏవిధంగా చూపించబోతున్నాడనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రక్త చరిత్ర చూపిస్తానంటూ ఇప్పటికే రాంగోపాల్ వర్మ స్పష్టం చేయడం గమనార్హం. ఈ సినిమాలో కొండ మురళి, సురేఖ ఆర్.కె అలియాస్ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఉంటాయని రాంగోపాల్ వర్మ ప్రకటించారు.