శ్రీనగర్ అక్టోబర్ 11
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. కశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లోని పిర్‌పంజాల్ శ్రేణుల్లో ఉగ్రవాదుల ఏరివేతకు వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) తోపాటు మరో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.పూంచ్ జిల్లాలోని నియంత్రణా రేఖ వెంబడి ఉన్న సురాన్ కోట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. అయితే గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దీంతో జేసీఓ సహా ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. దవాఖానకు తరలిస్తుండగా వారు కన్నుమూశారని వెల్లడించారు.కాగా, బందీపొరా జిల్లాలోని హజిన్ ప్రాంతంలో సోమవారం ఉదయం సైనికులు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. అతడు లష్కరే తొయిబాకు చెందిన ఇంతియాజ్ అహ్మద్ దార్‌గా గుర్తించామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. అదేవిధంగా అనంత్‌నాగ్ జిల్లాలో మరో గుర్తు తెలియని టెర్రరిస్టును ఇవాళ తెల్లవారుజామున హతమార్చారు.