ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సకాలంలో అమలుకాకపోతే ప్రభుత్వ ఉత్తర్వులకు అర్ధంలేకుండా పోతుంది. సంక్షేమ, అభివ్రుధ్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ ఉత్తర్వులు సక్రమంగా అమలు జరిగినప్పుడే, సామాన్య ప్రజలకు ప్రభుత్వం పై గౌరవం పెరుగుతుందన్నారు ఉపముఖ్యమంత్రి కే.ఈ.క్రిష్ణమూర్తి. మొదటి రోజు కలెక్టర్ల సమావేశంలో ఉపముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆలోచనా ధోరణి మారింది. ముందు చూపు, దూరద్రుష్టి, మనోధైర్యం ఉన్నవాడు నాయకుడిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఇవ్వన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పుష్కలంగా ఉన్నాయన్నారు. ఫేస్ బుక్, ట్వీట్టర్, వాటస్ప్ లాంటి సామాజిక మాధ్యమాలు దేశ రాజకీయాలను వేగంగా ప్రభావితం చేస్తున్నాయని, రాజకీయ పరిస్థితులు ఊహించని మలుపులు తిరుగుతున్నాయని తెలిపారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సంక్షేమ, అభివ్రుద్ధి కార్యక్రమాలు రూపొందించుకునే అధికారంర రాష్ట్ర ప్రభుత్వాలకు వుందని, రాజ్యాంగం చెబుతుంది, దీనికి విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వాలు, తమ కనుసనల్లో నడవాలనే ధోరణిలో కేంద్రం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రిగారికి అందరూ వెన్నుదన్నుగా నిలవాలన్నారు.ప్రభుత్వ అములు చేస్తున్న సంక్షేమ మరియు అభివ్రుద్ది కార్యక్రమాల క్షేత్రస్ధాయిలో సమర్ధవంతంగా అమలుపరిచే బాధ్యత కలెక్టర్లదే అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, మనం తీసుకొచ్చిన సంస్కరణలు అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు వస్తున్నారని అన్నారు. రెవెన్యూ శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అవార్డులు పొందామన్నారు. 2018 సంవత్సరానికి గాను, ఈ-గవర్నెన్స్ క్యాటగిరీ కింద రెవెన్యూ శాఖకు ఐఎస్వో 9001: 2015 సర్టిఫికేట్ పొందామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయడం లో జిల్లా యంత్రాంగం అలసత్వం వహిస్తుందన్నారు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని, ఇళ్లు నిర్మించుకున్న వాటిని క్రమబద్దీకరించేందుకు ఆదేశాలు ఇచ్చాము. ఇప్పటి వరకు ఈ విషయంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పురోగతి లేదన్నారు. అలాగే దేశంకోసం పాటుపడిన సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చిన భూములను పది సంవత్సరాల తరువాత బదిలీ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తూ 4.07.2016 న ఉత్తర్వులు జారీ చేశామని, 18 నెలలు గడచినా ఇప్పటివరకు 22-ఏ నిషేధిత జాబితా నుంచి ఆ సర్వే నెంబర్లను తొలగించలేదన్నారు.ప్రభుత్వంతో వివాదం లేని భూములను గుర్తించి వాటిని 22-ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని, జాయింట్ కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి పురోగతి లేదన్నారు. చుక్కల భూములు ఎక్కువుగా ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూముల క్రమబద్దీకరణ ఉత్తర్వులు ఇచ్చి 9 నెలలు గడుస్తున్నా, వచ్చిన 56 వేల 844 ధరఖాస్తులలో కేవలం పదుల సంఖ్యలో భూములకు మాత్రమే మోక్షం కలిగిందన్నారు. సమస్యను పరిష్కరించడం లో అధికారులు అలసత్వం వహిస్తున్నారని రైతులు అసంత్రుప్తితో ఉన్నారని తెలిపారు. రైతుల ఇబ్బందులు తొలగించడానికి డీమ్డ్ మ్యుటేషన్ పధ్దతిని ప్రవేశపెట్టామని, ఈ ఉత్తర్వుల మేరకు మ్యుటేషన్ నిర్దేశిత 30 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే, తాహశీల్దార్ డిజిటల్ సంతకంతో ఆటోమేటిక్ గా మ్యుటేషన్ జరుగుతుంది. ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుంచి 1 లక్షా 43 వేల316 ధరఖాస్తులు డీమ్డ్ మ్యుటేషన్లు జరిగాయి అంటే దానికి గల కారణాలను మనం అన్వేషించాలన్నారు.22-ఏ నిషేధిత భూముల జాబితా పై ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మా ద్రుష్టికి వచ్చింది. రిజిస్ట్రేషన్ సెక్షన్ 22-ఏ కింద రైతుల యొక్క పట్టా భూములను కూడా సరైన విచారణ, సమాచారం లేక జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా 22-ఏ నిషేధిత జాబితాల్లో చేర్చడం జరిగింది. ఈ విషయమై రైతులు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విరామం లేకుండా పరిష్కారం కోసం తిరుగుతున్నా న్యాయం జరగట్లేదన్నారు. సమస్యను పరిష్కరించేందుకు మీ ఇంటికి – మీ భూమి తరహాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆలోచిస్తున్నాం. త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తాం. ఇక ముందు ఏవైనా భూములను 22-ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చాలంటే సంబంధిత భూ అనుభవదారుడి నుంచి వివరణ తీసుకున్న తరువాతే నిషేధిత జాబితాలో చేర్చాలన్నారు.నవ్యాంధ్రలో పారిశ్రామికాభివ్రుద్ది త్వరితగతిన సాధించేందుకు, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు నాలా చట్టం సవరించి ఆదేశాలు ఇచ్చామని, ఏప్రిల్ 26 నాటికి 3 వేల 305 భూ-వినియోగ మార్పిడి ధరఖాస్తులు వస్తే, కేవలం పదుల సంఖ్యల్లో మాత్రమే పరిష్కరించారు. ఇదే పద్దతి కొనసాగితే నవ్యాంధ్రలో పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిశ్రమలు, వివిధ సంస్ధల ఏర్పాటుకు, ఏపీఐఐసీ కి ఇప్పటి వరకు 67 వేల 724 ఎకరాలు కేటాయించామని, ఇది రాష్ట్రం పారిశ్రామికంగా అభివ్రుద్ది చెందడానికి దోహదపడుతుందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం లో 3, విజయవాడ 3, కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా 9 అర్బన్ మండలాలు ఏర్పటు చేస్తున్నామని, అలాగే శిధిలావస్థలో వున్న తహసీల్దార్ మరియు ఆర్డీవో కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సర్వే అభ్యర్ధనలు త్వరితగతిన పరిష్కరించేందుకు సెర్ప్ లో పనిచేస్తున్న వెలుగు కమ్యునిటీ సర్వేయర్లను ఉపయోగించుకోవడానికి ముఖ్యమంత్రిగారు ఆమోదం తెలిపారు. భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ వినియోగించుకొని సర్వే చేసే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాం.రాష్ట్రంలో అన్ని రకాల భూములను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం భూ- సేవ ప్రాజెక్టును చేపట్టింది. భూ-సేవ ప్రాజెక్టులో భాగంగా ప్రతి ల్యాండ్ పార్సల్ కి ఆధార్ తరహాలో 11 అంకెల విశిష్ట సంఖ్యతో భూధార్ కేటాయిస్తారు. భూమికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తారు. భూ-సేవ ద్వారా రాష్ట్రం లోని 2.84 కోట్ల వ్యవసాయ భూములకు, 50 లక్షల పట్టణ ఆస్తులకు, 8.5 లక్షల గ్రామీణ ఆస్తులకు భూ-ధార్ కేటాయిస్తున్నాం. రెవిన్యూ, పురపాలక, సర్వే, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్, అటవీ మరియు దేవాదాయ శాఖలను ఈ ప్రజెక్టు ద్వారా అనుసంధానించనున్నాం. మే 30 నాటి క్రిష్ణా జిల్లా అంతటికీ, అక్టోబర్ 2 నాటికి రాష్ట్రం అంతా భూ-సేవా ప్రాజెక్ట్ సేవలను అమల్లోకి తేదల్చుకున్నాం. భూములు కొన్నా, విక్రయించినా ఆటోమేటిక్ గా కొనుగోలుదారుల వివరాలు అప్ డేట్ అవుతాయి. భూ రికార్డులు ట్యాంపరింగ్ కాకుండా, భద్రంగా ఉంటాయన్న నమ్మకాన్ని రైతులు, ప్రజలకు కలిగించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన అతికొద్ది శాఖలలో నేను నిర్వహించే రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 2017- 18 ఆర్ధిక సంవత్సరానికి 4 వేల కోట్ల లక్ష్యం నిర్ధేశించగా 4వేల 242 కోట్లు సాధించడం జరిగింది. ఈ నాలుగు సంవత్సరాలలో సరాసరి వ్రుద్ది రేటు 16.53 శాతం గా ఉందని చెప్పడానికి గర్వపడుతున్నాను. 2018-19 సంవత్సరానికి 4 వేల 880 కోట్లు ఆదాయం లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. దీన్ని కూడా తప్పక సాధిస్తామన్నారు.