విజయవాడ, అక్టోబరు 12,
ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ 151 నియోజకవర్గాల్లో అధికారంలోకి వచ్చింది. ఓడిపోయిన 24 నియోజకవర్గాల్లో రాజోలులో జనసేన, 23 చోట్ల టీడీపీ విజయం సాధించింది. ఎన్నికలకు మరో మూడున్నరేళ్ల సమయం ఉన్నా కూడా జగన్ పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసే నాయకుల కోసం ఇప్పటి నుంచే అన్వేషణ స్టార్ట్ చేసేశారు. ఈ క్రమంలోనే పార్టీ గత ఎన్నికల్లో ఓడిన పాలకొల్లు, పెద్దాపురం, రాజమండ్రి సిటీ లాంటి చోట్ల ఇప్పటికే నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను మార్చేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి చేరువ అవుతోన్న నియోజకవర్గాల్లో పార్టీ నేతలకు ఏదో ఒక పదవి ఇస్తూ ఎక్కడా అసమ్మతి లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే పార్టీ నాలుగు చోట్ల ఓడిన జిల్లాల్లో విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. విశాఖలో వైసీపీ ఆపరేషన్ దాదాపు పూర్తయినట్టే. ఒక్క తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మినహా.. మిగిలిన ముగ్గురిలో వాసుపల్లి గణేష్ ఇప్పటికే ఫ్యాన్ కిందకు రాగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, గణబాబు ఇద్దరూ రేపో మాపో ఫ్యాన్ పార్టీలోకి వెళ్లిపోతారనే అంటున్నారు. ఇక ఇప్పుడు జగన్ టార్గెట్ ప్రకాశం జిల్లా పైనే ఉందంటున్నారు. పార్టీ ఎంతో బలంగా ఉన్న ఈ జిల్లాలో టీడీపీ ఏకంగా నాలుగు స్థానాలు గెలుచుకోవడం జగన్‌కు ఎంత మాత్రం రుచించడం లేదట.ఈ క్రమంలోనే టీడీపీ గెలిచిన నాలుగు నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులు, నాయకుల సామర్ధ్యం, ఓటమికి కారణాలపై నివేదికలు తెప్పించుకున్న జగన్ నాయకత్వ మార్పుపై కొద్ది నెలల క్రితమే అంచనాలకు వచ్చారట. అయితే వీరిలో చీరాలలో సీనియర్ నేత కరణం బలరాం వైసీపీ సానుభూతిపరుడిగా మారడంతో పాటు ఆయన తనయుడు వెంకటేష్‌కు వైసీపీ కండువా కప్పించడంతో చీరాల విషయాన్ని జగన్ పక్కన పెట్టి ఇప్పుడు అద్దంకి, పరుచూరు, కొండపి నియోజకవర్గాలపై కాన్‌షంట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది. అద్దంకి నియోజకవర్గ నాయకత్వం విషయంలో జగన్ ముందు నుంచి అసంతృప్తితో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో తాను ఇచ్చిన మాట కోసమే గరటయ్యకు సీటు ఇవ్వగా ఆయన ఓడిపోయారు.ప్రస్తుతం అక్కడ గరటయ్య తనయుడు బాచిన కృష్ణ చైతన్య నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. గొట్టిపాటి రవిని ఢీకొట్టే విషయంలో చైతన్య సామర్థ్యంపై జగన్‌కు సందేహాలు ఉండడంతో అక్కడ కొత్త నేత కోసం ఓ వైపు అన్వేషిస్తూనే మరోవైపు తమ పార్టీ పాత మిత్రుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే రవి పార్టీలోకి వస్తాడా ? అని వెయిట్ చేస్తున్నారు. ఇక పరుచూరు విషయంలో జగన్‌కు నాలుగేళ్ల నుంచి తలనొప్పులు తప్పడం లేదు. గొట్టిపాటి నరసయ్యతో ప్రారంభిస్తే గొట్టిపాటి భరత్, రావి రామనాథం బాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పుడు మళ్లీ రావి రామనాథం బాబుతో పార్టీని నడిపిస్తున్నారు. ఇంత మందిని ఇక్కడ మార్చినా పార్టీ ఇప్పటకీ కునారిల్లుతోందిపర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైసీపీ ఆశలు పెట్టుకున్నా అవి నెరవేరలేదు. ఇక ఇప్పుడు ఆయన ఏకంగా బాపట్ల పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు అవ్వడంతో వైసీపీకి ఏకుమేకయ్యే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే రావి రామనాథం బాబును ఢీ కొట్టే బలమైన నేత కోసం అన్వేషణ జరుగుతోంది. కమ్మ వర్గం నేతలకే ఇక్కడ అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. చీరాల సమస్య పరిష్కారానికి ఇక్కడకు మాజీ ఎమ్మెల్యే ఆమంచిని పంపాలని చూస్తోన్నా అది ఫలించేలా లేదు.ఇక కొండపిలో మొన్న ఓడిన మాదాసు వెంకయ్యకు డీసీసీబీ చైర్మన పదవి ఇవ్వడంతో ఆయన్ను పక్కన పెట్టి మరో బలమైన నేత కోసం అన్వేషణ ప్రారంభమైంది. టీడీపీ ఎమ్మెల్యే స్వామికి గేలం వేస్తూనే వరికూటి అశోక్‌కుమార్, జూపూడి ప్రభాకర్‌రావుతో పాటు మరి కొందరి నేతల పేర్లు ఇక్కడ పరిశీలనలో ఉన్నాయి. మరి జగన్ కాన్‌సంట్రేషన్లతో ఈ మూడు నియోజకవర్గాల సిట్టింగ్ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెడుతోన్న పరిస్థితే ఉంది.