YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నీటి సరఫరాలో నిర్లక్ష్యమేల..

 నీటి సరఫరాలో నిర్లక్ష్యమేల..

జిల్లాలోని వివిధ పట్టణాల్లో తాగు నీటి సరఫరాకు ఏడాదికి సుమారు రూ.5 కోట్లను ట్యాంకర్లపై వెచ్చిస్తున్నారు. మంచినీటి సమస్య ఉన్న చోట్ల కొన్ని ప్రైవేటు, మరికొన్ని పురపాలికలవి తిరుగుతున్నాయి. వాహనం ఏదైనా అన్నింటికీ జీపీఎస్‌ అమర్చి వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా వాటి రాకపోకలు నమోదు చేయాలని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్‌ చీఫ్‌ ఏడాది క్రితం ఆదేశాలు ఇచ్చారు. ఈ విధానంలో ట్యాంకరు బయల్దేరినప్పటి నుంచి దాని కదలికలు మానిటర్‌ ద్వారా గమనించవచ్చు. పురపాలిక ఇంజినీర్‌తోపాటు కమిషనర్‌ తమ తమ సెల్ ఫోన్ల ద్వారా కూడా పరిశీలించవచ్చు. దీనివల్ల కచ్చితంగా ప్రతిరోజూ వాహనం ఎన్ని ట్రిప్పులు, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతోంది? ఎక్కడ నీరు పోస్తుందో తెలిసిపోతుంది. తద్వారా గోల్‌మాల్‌ జరగకుండా లెక్కలు ఖచ్చితంగా తేలిపోతాయి. మున్సిపాలిటీ వాహనమైతే ఆయిల్‌ వినియోగంలో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయవచ్చు. పారదర్శకత ఉండేందుకు అమలు చేస్తున్న వీటీఎస్‌ను పాలకులు, గుత్తేదారులు కలిసి స్వార్ధం కోసం నిర్వీర్యం చేశారు.

వినుకొండ మున్సిపాలిటీలోని ఏడు ట్యాంకర్లు 56 ట్రిప్పులు తిరగాల్సివుండగా స్థానిక కాంట్రాక్టర్లు లోపాయికారి ఒప్పందం చేసుకుని 14 ట్యాంకర్లు ట్రిప్పులు పంచుకుని తిప్పుతున్నారు. ఇప్పటి వరకు వీటీఎస్‌ అమలు చేయడం లేదు. కాగితాల్లో లెక్క రాస్తున్నప్పటికీ వాహనాలపై నియంత్రణ లేదు. కొన్ని ప్రైవేటుగా నీళ్లు పోసి సొమ్ము చేసుకుంటున్నా అడిగే నాథుడే లేరు. ట్రిప్పుకు రూ.350 వంతున రోజుకు రూ.19,600 ఖర్చు చేస్తున్నారు. ఏడాదికి సుమారు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నారు. చిలకలూరిపేటలో 12 ట్యాంకర్లు తిరుగుతున్నాయి. జీపీఎస్‌ పరికరాలు ఏర్పాటు చేసినా అవి సక్రమంగా పని చేయడం లేదు. మాచర్లలో నాలుగు ప్రైవేటు, ఒకటి పురపాలిక మొత్తం ఐదు నడుస్తున్నాయి. వీటికి ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయలేదు. పిడుగురాళ్లలో ఇప్పటి వరకు మున్సిపాలిటీకి చెందిన రెండు సొంత వాహనాలు తిరుగుతుండగా టెండర్‌ పద్ధతిలో మరో ఆరింటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడా వీటి ఊసేలేదు. బాపట్లలో మూడు పురపాలక సంఘ ట్యాంకర్లు జీపీఎస్‌ లేకుండానే తిరుగుతున్నాయి. నరసరావుపేట ఇందుకు మినహాయింపు కాదు.

Related Posts