YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోలగట్లకు బెర్తు ఖరారు

కోలగట్లకు  బెర్తు ఖరారు

విజయనగరం, అక్టోబరు 13,
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపైనే చర్చంతా జరుగుతుంది. బహుశ సంక్రాంతికి మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయంటున్నారు. దీంతో ఎంతోమంది మంత్రి పదవులపై ఆశలు పెంచుున్నారు. ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి ఈసారి తనకు మంత్రి పదవి గ్యారంటీ అని నమ్మకం పెట్టుకున్నారు. అంతా సవ్యంగా జరిగితే ఆయనకే మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి.కోలగట్ల వీరభద్రస్వామి పార్టీలో సీనియర్ నేత. దాదాపు మూడున్నర దశాబ్దాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. పెనుమత్స సాంబశివరాజు వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన ఆయన పాలిటిక్స్ లో ఎదిగారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీ పెట్టిన వెంటనే విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ కంటే ముందు పార్టీలో చేరి జగన్ కు అండగా నిలిచారు. 2014లో కోలగట్ల వీరభద్రస్వామి ఓటమి పాలయినా ఆయనను జగన్ ఎమ్మెల్సీ చేశారు.వైశ్య సామాజికవర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామి గత ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు కుటుంబాన్ని ఓడించి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. తొలిసారి మంత్రివర్గంలోనే ఆయనకు చోటు దక్కాల్సి ఉన్నా సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు దక్కలేదు. అదే సామాజికవర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది. ఈసారి మొత్తం మంత్రి వర్గాన్ని జగన్ మార్చేస్తారంటున్నారు. ఈ నేపథ్యంలో వైశ్య సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే అయిన తనకు మంత్రి పదవి దక్కుతుందని కోలగట్ల వీరభద్రస్వామి భావిస్తున్నారు.ఇద్దరే వైశ్య సామాజికవర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. కోలగట్ల వీరభద్రస్వామి, వెల్లంపల్లి శ్రీనివాస్ లు. వెల్లంపల్లి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. గుంటూరు నుంచి టీడీపీ గుర్తు మీద గెలిచిన మద్దాలి గిరి అదే సామాజికవర్గమైనా ఆయనకు ఛాన్స్ లేదు. దీంతో జగన్ తనకు మంత్రి పదవి ఇస్తానని గతంలో ఒకసారి మాట ఇచ్చారని కోలగట్ల వీరభద్రస్వామి అంటున్నారు. తనకు ఇదే మంత్రి పదవికి చివరి అవకాశమని ఆయన భావిస్తున్నారు. కానీ తాను జగన్ వద్దకు వెళ్లి మంత్రి పదవి కోసం పైరవీ చేయనని, ఆయనంతట ఆయనే ఇస్తే తీసుకుంటానని చెబుతున్నారు. జగన్ మాట ఇచ్చారు కాబట్టి తప్పరని, తనకు మంత్రి పదవి గ్యారంటీ అని ఆయన గట్టిగా చెబుతున్నారు.

Related Posts