ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలోనే సమీకరణాలు మారబోతున్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తుకు జనసేన దాదాపు సిద్ధమయిందనే చెప్పాలి. ఎన్నికలకు ఏడాది ముందు రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరే అవకాశముంది. అయితే దీనికి సూత్రధారి నాదెండ్ల మనోహర్ అని చెబుతున్నారు. ఆయన పవన్ కల్యాణ్ మైండ్ ను ఛేంజ్ చేశారన్నది జనసేనలోనూ వినిపిస్తున్న అభిప్రాయం.జనసేన పార్టీలో ఇప్పటి వరకూ నాదెండ్ల మనోహర్ కీలకమనే చెప్పాలి. ఆయన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. మాదాసు గంగాధరం వంటి నేతలు పార్టీని విడిచి బయటకు వెళ్లడానికి కారణం కూడా నాదెండ్ల మనోహర్ కారణమంటారు. ఒకరకంగా జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీకి దూరం కావడానికి కూడా నాదెండ్ల మనోహర్ కారణమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.జనసేన, టీడీపీతో పొత్తు కు వచ్చే ఎన్నికల్లో బీజం పడటానికి కూడా నాదెండ్ల మనోహర్ కీలకంగా మారబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీని నడపలేక ఆర్థిక ఇబ్బందులతో పవన్ కల్యాణ్ సినిమాలను ఎంచుకున్నారు. మరో ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉంటే మరింత ఇబ్బంది పడతామని నాదెండ్ల పదే పదే పవన్ కల్యాణ్ కు చెప్పడంతో ఆయన టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారని తెలిసింది.పదేళ్లుగా శాసనసభకు దూరంగా ఉన్న నాదెండ్ల మనోహర్ కు కూడా టీడీపీతో పొత్తు ప్రయోజనకరమే. తెనాలిలో తన సీటుకు ఢోకా ఉండదని కూడా ఆయన భావిస్తున్నారని పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. అందుకే కమ్మ సామాజికవర్గానికి అనుకూలంగా పవన్ కల్యాణ‌్ చేత నాదెండ్ల మనోహర్ మాట్లాడించారంటున్నారు. మొత్తం మీద టీడీపీ నాదెండ్ల మనోహర్ సహకారంతో మరోసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తుంది.