తిరుమల
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉదయం శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు సర్వభూపాల వాహనంలో దర్శనమిచ్చారు. ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనసేవ జరిగింది.. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు