కాంగ్రెస్ కు ఈ దురవస్థ ఎప్పుడూ లేదు. ఇన్నాళ్లూ పార్టీ పై పెత్తనం చెలాయించిన టెన్ జన్ పథ్ ఇప్పుడు చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది. అధికారంలో సొంతంగా ఉంది మూడు రాష్ట్రాల్లో. ఈ మూడు రాష్ట్రాల్లోనూ అసంతృప్తిని కట్టడి చేయలేకపోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు అయిన వారిలో కూడా మార్పు వచ్చింది. హైకమాండ్ తమను ఏమీ చేయలేదని ఎక్కడకక్కడ సొంత గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు.2014 వరకూ సోనియా గాంధీ ఏది చెబితే అదే వేదం. వరసగా రెండు సార్లు అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నేతలు కూడా సోనియా ఆదేశాలను తుచ తప్పక అమలు చేసేవారు. టెన్ జన్ పథ్ నుంచి ఏం ఆదేశాలు వస్తాయోనన్న ఉత్కంఠ వారిలో కనపడేది. కానీ రెండు సార్లు వరసగా ఓటమి పాలు కావడం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో సోనియా గాంధీని కూడా లెక్క చేయని పరిస్థితి కాంగ్రెస్ నేతల్లో కన్పిస్తుంది.కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు నాలుగు రాష్ట్రాలను ప్రజలు ఆ పార్టీకి అందించారు. పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ గొడవల కారణంగా అధికారాన్ని కోల్పోయి తిరిగి బీజేపీకి అప్పజెప్పాల్సి వచ్చింది. జ్యోతిరాదిత్య సింధియాను దూరం చేసుకుని టెన్ జన్ పథ్ అతి పెద్ద తప్పిదం చేసింది. ఆయన వచ్చే ఎన్నికలలో బీజేపీకి కీలకంగా మారనున్నారు.ఇక అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు హైకమాండ్ ను అవసరమైతే ఎదిరించే ధోరణిలో ఉన్నారు. పంజాబ్ లో చివరకు ముఖ్యమంత్రిని మార్చి కాంగ్రెస్ చేతులు కాల్చుకుంది. పంజాబ్ లో ఇప్పుడు కాంగ్రెస్ ను బలోపేతం చేయడం అంత సులువు కాదు. ఇక రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలోనూ అసంతృప్తి మామూలుగా లేదు. ఎప్పుడైనా అవి బయటపడే అవకాశాలున్నాయి. మొత్తం మీద టెన్ జన్ పథ్ నేతలపై పట్టు కోల్పోయిందనే చెప్పాలి.