ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒక్కోరోజు ఒక్కో ఉదంతంతో రాజకీయం హోరెత్తిపోతోంది. 2019లో అమరావతి రాజకీయ పీఠాన్ని దక్కించుకోడానికి ఇటు అధికార టీడీపీ.. అటు ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ రెండూ జీవన్మరణ పోరాటం ప్రారంభించాయి. టీడీపీ అయితే తాము మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయని, తాము గెలవకపోతే రాజధాని అమరావతిని మరెక్కడికో తరలించేస్తారని, అభివృద్ధి పదేళ్లు వెనకపడిపోతుందని చెబుతూ చాపకింద నీరులా సోషల్ మీడియా ద్వారాను, వివిధ సభల ద్వారాను ప్రచారం ప్రారంభించింది. 2019లో అధికారం దక్కించుకోకపోతే తన రాజకీయ మనుగడ కష్టమని భావిస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజకీయ రణరంగాన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.రానున్న పదినెలల్లో అమరావతి, పోలవరం నిర్మా ణాలు వీలైనంత పూర్తిచేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే బీజేపీ తదితర పక్షాలు పోల వరం, పట్టిసీమలను అవినీతి ప్రాజెక్టులుగా చూపా లని ఫిర్యాదులు చేయనున్నారని.. అలాంటి ఫిర్యాదు లకు తాను భయపడే ప్రశ్నేలేదని చంద్రబాబు తన ఆంత రంగికులతో వ్యాఖ్యానిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్ని కల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయం రంజుగా ఉండే అవకాశం ఉంది. ఈనెల చివరన విజయవాడలో నిర్వ హించనున్న మహానాడు, 20వ తేదీన విశాఖలో నిర్వ హించనున్న బహిరంగ సభలతో కేంద్రంతో పాటు విప క్షాలపై దాడికి టీడీపీ సిద్ధమవుతోంది.2019లో ఎలాగైనా అధికారం కైవశం చేసుకోవాలని కసితో పాదయాత్ర ప్రారంభించిన జగన్ ఈనెల 14న పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించనున్నారు. చంద్రబాబు స్పందనలకు ఘాటుగా ప్రతిస్పందిస్తూ ఢీ అంటే ఢీ అని తలపడుతూ రాజకీయ రణరంగాన శ్రమిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నడంలో వ్యూహకర్తల వైఫల్యం కనిపిస్తోంది. దాచేపల్లి ఘటనపై రెండు రకాలుగా వ్యూహాన్ని అవలంబించడంతో వైసీపీకి కొంత నష్టం వాటిల్లినట్లు కనిపిస్తోంది.మరో వైపు త్రిపుర ఎన్నికల తరహాలో.. పెద్దఎత్తున వలంటీర్లు రంగప్రవేశం చేసి బీజేపీ అనుకూల ప్రచారంతో రాష్ట్రవ్యాప్తంగా ఏక కాలంలో హోరెత్తించడం వారి వ్యూహంలో ప్రధాన భాగం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నియమితులైన రాంమాధవ్ బీజేపీ బలాలు బలహీనతలతో పాటు, అటు వైసీపీ.. ఇటు జనసేన బలాబలాలను కూడా గుర్తించడంలో నిమగ్నమై ఉన్నారు. పదవీ విరమణ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మినారాయణను తొలుత బీజేపీలోకి తీసుకుని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా నియమించాలని భావించారు. అయితే మరోవైపు లక్ష్మీనారాయణ జనసేనలో చేరతారని కూడా మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి తాను ఇంకా రాజకీయ నిర్ణయం తీసుకోలేదని, రెండునెలల పాటు ప్రజా సమస్యలపై అధ్యయనం చేసిన తర్వాత ఆ సంగతి చూస్తానని ఆయన స్వయంగా చెప్పడంతో ప్రచారాలు కాస్త సద్దుమణిగాయి. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో లక్ష్మీనారాయణ ఓ ప్రాంతీయ పార్టీని నెలకొల్పనున్నారని, త్వరలో అందుకు సంబంధించిన ప్రకటన రానుందని... ఆ పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఒక కూటమిగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో రెండు మూడు రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలతో లక్ష్మీనారాయణకు మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ సూచనల ప్రకారమే ఆయన ముందడుగు వేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మహారాష్ట్రలో సర్వీసులో ఉన్నకాలంలో కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధం ఉన్న కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల అభివృద్ధికి లక్ష్మీనారాయణ తనవంతు తోడ్పాటు అందించారని కూడా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన నిధులు, ఇవ్వని నిధులపై నిజనిర్ధారణ కమిటీ వేసి హడావుడి సృష్టించిన జనసేనాని పవన్‌కల్యాణ్... ఆ తర్వాత జరిగిన పలు వరుస పరిణామాలతో తెరవెనక్కి జరిగి పోయారు. విజయవాడలో వామపక్షాలతో కలసి ఆర్భాటంగా పాదయాత్ర సైతం చేసిన పవన్.. ఆ తర్వాత నిర్వహించాల్సిన తిరుపతి, అనంతపురం సభలను వాయిదా వేసి అనూహ్యంగా వామపక్షాలకు దూరం జరిగారు. వామపక్షాలకు కూడా పవన్ తమను ఎందుకు దూరం పెట్టారో అర్థంకాక తలలు పట్టుకుం టున్నాయని సమాచారం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని, తెలంగాణ సంగతి ఏంటో ఆగస్టులో స్పష్టం చేస్తానని చెబుతూ.. తాను ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని ఇప్పటికైతే చెప్పకనే చెప్పేశారు.