ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా 'నాట్యం'. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ పెంచింది. ఈ క్రమంలోనే దర్శకుడు రేవంత్ కోరుకొండ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...
మాది అనకాపల్లి. అమెరికాలో చదువుకున్నాను. సినిమాలు ఇష్టం. కథలు రాయడం ఇష్టం. విఠలాచార్య లాంటి సినిమాలు ఎంతో ఇష్టం. మన దగ్గర చాలా మంచి కథలున్నాయి. మైథాలజితో ఎన్నె కథలుంటాయి. అలాంటి వాటిని తీసుకురావాలని అందుకే ఈ చిత్రాన్ని తీశాను. నాట్యం అంటే కథను అందంగా చెప్పడం. మంచి తెలుగు సినిమాను తీయాలని అనుకున్నాం. అలా అనుకున్నప్పుడు మనకు గుర్తుకు వచ్చేది కే విశ్వనాథ్ గారే. అందుకే ఇలా ఓ క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో సినిమాను తీశాను. అందుకోసం నాట్యశాస్త్రం పుస్తకాన్ని చదివాను. అందులో ఇది తప్పు అని మనిషికి చెబితే వినడు.. కథతో చెబితే వింటాడని బ్రహ్మ అనుకుంటాడు. అలా ఓ కథను నాట్యం ద్వారా చెబుతాడు. అందుకే నాట్యం అంటే అభినయం అంటారు. మంచి కథను సినిమాగా చెబితే రీచ్ అవుతుందని అనుకున్నాను. అలా నాట్యం, ఓ ఊరు, ఊర్లో గొడవలు, కొన్ని పాత్రలను అల్లి ఈ కథను రాశాను.
ఊర్లో ఉన్న మూఢ నమ్మకాలను గురువు నాట్యం ద్వారా మార్చాలని అనుకుంటాడు. ఆ కథను పాపకు చెబుతాడు. కానీ మధ్యలో ఆపేస్తాడు. కానీ పాపలో మాత్రం ఆ కథ అలానే బలంగా నాటుకుపోతుంది. ఆ అమ్మాయికి ఆ కథకు ఉన్న సంబంధం.. చివరకు ఆ కథ చెబుతుందా? ఊర్లో జనాలు మారుతారా? అనేదే నాట్యం సినిమా.
కెమెరామెన్, ఎడిటర్, డైరెక్టర్‌గా నేను ఈ సినిమాకు పని చేయడం వల్లే బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ మూడు ఎలా చేశారని అంతా అనుకోవచ్చు. నేను షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను. అక్కడ అంతా మనమే చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడే ఆ పనులన్నీ నేర్చుకున్నాను. ఏ లైట్ ఎలా వాడాలనేది కూడా నేర్చుకున్నాను. టెక్నికల్ నాలెడ్జ్, క్రియేటివ్ నాలెడ్జ్ అన్నీ కూడా నేర్చుకున్నాను. అలా మూడు విభాగాలను చేయడంతో సినిమా బాగా వచ్చిందని నమ్ముతున్నాను.
సంధ్యా రాజు ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్. ఈ కథను చాలా మందికి వినిపించాను. అందరికీ నచ్చింది. కానీ ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయితే ఈ సినిమాకు బాగుంటుందని అందరూ అన్నారు. నేను చాలా యాడ్ ఫిల్మ్స్‌ను తెరకెక్కించాను. సంధ్యా రాజు గారితో ఇది వరకే నేను ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను. అక్కడ నా వర్క్ నచ్చడం, ఆ షార్ట్ ఫిల్మ్‌కు మంచి స్పందన వచ్చింది. అలా ఈ నాట్యం చిత్రం మొదలైంది. నేను కచ్చితంగా క్లాసికల్ డ్యాన్స్ మీదనే మొదటి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను అని సంధ్యా రాజు గారితో చెప్పాను. కథ బాగా నచ్చడంతో నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఆమె కూడా ఓ కారణం. నిర్మాతగానే కాకుండా టెక్నీషియన్‌గానూ ఎంతో సపోర్ట్ చేశారు. ఇలాంటి సినిమాలకు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సంధ్యా రాజు గారు ఎంతో పరిశోధన చేశారు.
కమర్షియల్ డ్రామా ఎలిమెంట్స్ అన్నీ కూడా నాట్యం సినిమాలో ఉంటాయి. అన్ని ఎమోషన్స్, సినిమాటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి.
మొదటి సినిమా అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని, డిఫరెంట్ సబ్జెక్ట్‌తో రావాలని అనుకున్నాను. అందుకే కే విశ్వనాథ్ గారిలా ఓ క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో సినిమా తీయాలని అనుకున్నాను. ఇక సంధ్యా రాజు గారికి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలా మా అభిరుచి కలవడంతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది.
నాట్యం స్క్రిప్ట్ మీదే దాదాపు తొమ్మిది నెలలు కూర్చున్నారు. ఓ గురువు తన కథను ఊరి జనాలు బయటకు తీసుకు రానివ్వడం లేదు. శిష్యురాలు ఎలా తీసుకువస్తుందనేది కథ. అన్ని రకాల ఎమోషన్స్‌ను అందులో పెట్టాను. కూచిపూడి, భరతనాట్యం ఎలా ఉంటాయి.. కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయని చాలా రీసెర్చ్ చేశాను. లొకేషన్ల కోసం దాదాపు మూడు నెలలు వెతికాను. ఎన్నో గుళ్లు తిరిగాను. శ్రీకృష్ణ దేవరాయలు కల్చర్ ఎక్కువగా కనిపించింది.
సంధ్యా రాజు గారు లేకపోతే ఈ చిత్రం ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. ఆమె కేవలం నటిగా వచ్చి వెళ్లేవారు కాదు. నాతో పాటు ఉంటూ ఓ టెక్నీషియన్‌లా పని చేసేవారు. సినిమాతో పాటుగా ప్రయాణం చేశారు.
నాకు, మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్‌కు ఆరేళ్ల స్నేహం ఉంది. షార్ట్ ఫిల్మ్స్ టైం నుంచి మేం పని చేస్తున్నాం. క్లాసికల్ డ్యాన్స్‌కు సరిపోయే సంగీతాన్ని అందించారు. కర్ణాటిక్ స్టైల్లో ఉండాలి అలానే సినిమాటిక్‌గానూ ఉండాలని చెప్పాను. అలానే శ్రవణ్ సంగీతాన్ని ఇచ్చారు.
రామ్ చరణ్ లాంటి వారు మా సినిమా ఈవెంట్‌కు రావడం మా అదృష్టం. సినిమా చూశాకే ఈవెంట్‌కు వస్తాను అని రామ్ చరణ్ గారు అన్నారు. సినిమా చూసి మెచ్చుకున్నారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని ప్రోత్సహించారు.
గురువు కలను నెరవేర్చే శిష్యురాలి కథ. గురువు అనుకున్న కథను ఆ శిష్యురాలు నాట్యం ద్వారా ఎలా చెప్పింది? ఊర్లోని మూఢనమ్మకాలను ఎలా పోగొట్టింది అనేది కథ.
తెలుగుదనం ఉట్టిపడేలా, భారత సంస్కృతిని తెలిపేలా సినిమాలు తీయడమనేదే నా కల. నెక్స్ట్ కూడా అలాంటి సినిమానే తీస్తాను.