రామప్ప టెంపుల్‌కు ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు వచ్చాక ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జులై 25న చైనాలో జరిగిన యునెస్కో సమావేశంలో రామప్ప టెంపుల్కు ఈ విశేష గుర్తింపు దక్కింది. ఇంజినీరింగ్, శిల్పకళకు నెలవైన రామప్ప ఆలయం ఇకపై ప్రపంచ స్థాయి కట్టడమని స్పష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు మిన్నంటాయి. ఈలోగా కరోనా తగ్గుముఖం పట్టడం, పర్యాటకులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేయడంతో తెలంగాణ, ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో టూరిస్టులు వచ్చి రామప్ప గుడి శిల్పకళా సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు.13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో రామప్ప ఆలయం నిర్మితమైంది. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని హయాంలో ఆయన సేనాని రేచర్ల రుద్రయ్య రామప్ప దేవాలయాన్ని నిర్మించారు. 1173లో మొదలైన పనులు 40 ఏళ్ల పాటు సాగి 1213లో పూర్తయ్యాయి. ఇది శివాలయం అయినప్పటికీ శిల్పి పేరుతో పిలుస్తున్నారు. కర్ణాటకకు చెందిన రామప్ప అనే శిల్పి దేవాలయాన్ని నిర్మించారు. ఇలా శిల్పిపేరుతో పిలవబడే దేవాలయం భారతదేశంలోనే ఇదొక్కటే కావడం విశేషం. దీనిని రామలింగేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. రామప్ప ఆధ్వర్యంలో సుమారు 300 పైగా శిల్పులు ఈ టెంపుల్ కోసం పనిచేశారు. వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు కోసం రాష్ట్రం నుంచి మూడు చారిత్రక కట్టడాలు పోటీ పడగా, అందులో సాంకేతిక కారణాల వల్ల ఖిలా వరంగల్, వేయి స్తంభాల గుడి తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయం ఒక్కటే ఎన్నికైంది. ఇండియాలో1983లో అజంతా, ఎల్లోరా, ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్కు తొలిసారిగా యునెస్కో గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 38 ప్రదేశాలకు మాత్రమే యునెస్కో గుర్తింపు దక్కింది. వీటిలో 30 కల్చరల్, 8 నేచురల్సైట్స్ఉన్నాయి. మొన్నటివరకు తెలంగాణ, ఏపీ నుంచి ఒక్క ప్లేస్ కూడా ఈ లిస్టులో లేదు. 2018లో జైపూర్, రామప్ప, ఉండవల్లి ప్రదేశాలు పోటీ పడగా జైపూర్కు చోటు దక్కింది. 2020లో మరోసారి రామప్ప పోటీలో నిలిచింది. ఈ సారి యునెస్కో గుర్తింపు దక్కడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటి ప్రపంచ వారసత్వ కట్టడంగా నిలిచింది. సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మమైన శిల్పాలు రామప్ప టెంపుల్లో కొలువుదీరి ఉన్నాయి. ఆలయం బరువును మోస్తున్నట్టుగా వందలాది ఏనుగుల శిల్పాలను చెక్కారు. ఒక ఏనుగుతో మరో ఏనుగుకు సంబంధం లేకుండా విభిన్నంగా ఉంటాయి. ఇక శివుడి ఎదురుగా ఉన్న నంది గురించి వర్ణించడానికి మాటలు చాలవు. శివుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెవిని లింగం వైపు పెట్టి.. లేవడానికి తయారుగా ఉన్నట్టుగా నందిని మలిచారు. రామప్ప కట్టడంలో అప్పటి శిల్పులు శాండ్ బాక్స్ టెక్నాలజీ ఉపయోగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువ. ఎక్కువ బరువు ఉండే రాతి నిర్మాణాలను ఈ నేలలు తట్టుకోలేవు. అందుకే నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఇంజనీరింగ్ నైపుణ్యం ప్రదర్శించారు. దీన్ని నేటి ఇంజనీర్లు శాండ్‌బాక్స్ టెక్నాలజీగా చెబుతున్నారు. ఆలయం నిర్మాణ స్థలంలో మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపారు. ఈ ఇసుక ఎప్పుడు తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇసుకపై రాళ్లను పేర్చుకుంటూ పోయి కక్ష్యా మండపం వరకు నిర్మించారు. అక్కడి నుంచి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయం నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటాయి. బ్లాక్ గ్రానైట్ రాయిపై చెక్కిన మదనికల సొగసు వర్ణణాతీతం. ఇక ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిఫ్టు, మంగోలియా యాత్రికుల శిల్పాలు అబ్బుర పరుస్తాయి. ఇక ఆలయం లోపల నాట్యమండపం ఆనాటి శిల్ప కళా వైభవానికి తార్కాణంలా నిలిచిపోతుంది.రామప్ప టెంపుల్ నిర్మాణంలో తేలియాడే ఇటుకలను ఉపయోగించారు. నేల స్వభావాన్ని బట్టి ఆలయం బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలను తయారు చేశారు. సాధారణ నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. కానీ రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకలు కేవలం 0.8 సాంద్రతను కలిగి ఉన్నాయి. అందుకే ఇవి తక్కువ బరువు కలిగి ఉండి నీటిలో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు.