రాజకీయంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్ తీసుకొని గెలుపే లక్ష్యంగా బరిలో దిగాయి. అయితే ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొందనే టాక్ విన్పిస్తోంది. ఈటల రాజేందర్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా సీన్ మారిపోవడంతో హుజూరాబాద్ లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ సైతం తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఆయా పార్టీల తరుఫున కీలక నేతలు రంగంలోకి ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్న పార్టీలు పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టిసారిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న హుజూరాబాద్ ఓటర్లను ఇక్కడి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అదేవిధంగా పోస్టల్ ఓట్లపై ఆయా పార్టీల నేతలు నజర్ వేస్తున్నారు. హుజూరాబాద్ లో ఇప్పటి వరకు 822మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. ఈ ఓట్లన్నింటిని గంపగుత్తగా దక్కించుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయ్యేనాటికి హుజూరాబాద్ నియోజకవర్గంలో 2.36లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య మరో పదివేలకు పెరిగింది. ఇంత పెద్దమొత్తంలో కొత్త ఓటర్లు పెరిగిపోవడం అభ్యర్థుల్లో ఒకింత ఆందోళనను రేపుతోంది. కొత్తగా నమోదైన ఓటర్లు గెలుపొటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇతర ప్రాంతాలకు చెందిన ఓటర్లు సైతం హుజూరాబాద్ లో ఓటరుగా నమోదు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు స్థానికేతరులైన ఓటర్లపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టిసారిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థానిక ఓటర్ల సమచారాన్ని సేకరిస్తున్నారు. వీరందరినీ సొంత ఖర్చుతో పోలింగ్ కేంద్రాలను తరలించేందుకు వారంతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఉప ఎన్నికలో 80ఏళ్లు నిండిన వృద్ధులు, కోవిడ్ పేషంట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునేలా ఈసీ అవకాశం కల్పించింది. దీనిని సద్వినియోగం చేసుకునేలా ఆయా పార్టీలు కసరత్తులు చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఉప ఎన్నిక మాత్రం నియోజకవర్గంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు